● విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా ఏర్పాటు ● జిల్లాలోని 23 పాఠశాలల ఎంపిక ● వసతుల కల్పనకు రూ.15 వేలు ● ఆ తర్వాత నెలకు రూ.వేయి మంజూరు
జిల్లాలోని 23 పాఠశాలల్లో రీడింగ్ కార్నర్ల పేరిట గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఆయా స్కూళ్లలో ప్రత్యేక గదిని తీర్చిదిద్దేందుకు రూ.15 వేలు కేటాయిస్తారు. ఈ నిధులతో అవసరమైన ఏర్పాట్లు చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.
– చైతన్యజైనీ, జిల్లా విద్యాశాఖాధికారి
లైట్రరీల ఏర్పాటుకు ఇప్పటికే మండలాల వారీగా పాఠశాలల ఎంపిక పూర్తయింది. ప్రభుత్వం ఇచ్చే నిధులతో వసతులు కల్పిస్తాం. గ్రంథాలయ ఏర్పాటుతో విద్యార్థులకు వార్తాపత్రికలు, ఇతర పుస్తకాలు అందుబాటులోకి వచ్చి పఠనాసక్తి పెరుగుతుంది.
– పెసర ప్రభాకర్‌రెడ్డి, ఏఎంఓ
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాక వారిలో పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెంచేలా గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయించింది. రీడింగ్ కార్నర్ల పేరిట వీటిని తొలిదశలో జిల్లాలోని 23 పాఠశాలల్లో ఏర్పాటు చేస్తారు. పాఠశాలల్లో గది సౌకర్యం, విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలలను ఎంపిక చేశారు.
ఆహ్లాదంగా తీర్చిదిద్దేలా..
విద్యార్థులను పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలో లోకజ్ఞానం పెంచడం, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచేందుకు గాను లైబ్రరీల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎంపిక చేసిన పాఠశాలల్లోని ఓ గదిని అన్ని వసతులతో తీర్చిదిద్దుతారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం రూ.15 వేల చొప్పున నిధులు కేటాయించింది. ఈ నగదుతో గదుల్లో అవసరమైన మరమ్మతులు చేయించి రంగులు వేయించడమే కాక రీడింగ్ టేబుళ్లు, కుర్చీలు, పుస్తకాల ర్యాక్‌లు, లైట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించాలి. ఆ తర్వాత రోజువారీగా వార్తా పత్రికలు, ఇతర జనరల్ నాలెడ్జి పుస్తకాలను లైట్రరీలో అందుబాటులో ఉంచనున్నారు. పుస్తకాల కొనుగోలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఇకపై ప్రతీ నెల రూ.వేయి నగదును అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఖాతాల్లో జమ చేస్తారు.
అర్బన్‌లో అత్యధికం
జిల్లాలో లైబ్రరీల ఏర్పాటుకు 23 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో అత్యధికంగా ఖమ్మం అర్బన్ మండలంలోనే 13 స్కూళ్లు ఉన్నాయి. ఇక సత్తుపల్లి మండలంలో నాలుగు, కొణిజర్ల, మధిర మండలాల్లో రెండేసి పాఠశాలలతో పాటు చింతకాని, తిరుమలాయపాలెం మండలంలో ఒక్కో పాఠశాలను ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం నుంచే గ్రంథాలయాలు అందుబాటులోకి రానున్నాయి.


