బడికి పోదాం.. చలో చలో | - | Sakshi
Sakshi News home page

బడికి పోదాం.. చలో చలో

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

ముగిసిన వేసవి సెలవులు నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అక్కడక్కడ వెక్కిరిస్తున్న సమస్యలు ఎంఈవోలంతా ఇన్‌చార్జిలే ఈసారైనా విద్యాశాఖ గాడిన పడేనా అని ఆశ

కరీంనగర్‌టౌన్‌: వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులు ఆటపాటలకు టాటా చెప్పి.. బడిబాట పట్టే సమయం రానేవచ్చింది. సుమారు రెండు నెలలుగా వెలవెలబోయిన పాఠశాలలు నేటి నుంచి విద్యార్థులతో కళకళలాడనున్నాయి. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభానికి పాఠశాలలు ముస్తాబయ్యాయి. జూన్‌ 12న పాఠశాలలు తెరవాల్సి ఉండగా ఎండ తీవ్రత నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటిలాగా ఈ ఏడాదీ సర్కారు స్కూళ్లు కొద్దిపాటి సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. పర్యవేక్షణాధికారుల లేమి, అక్కడక్కడ మౌలిక వసతుల కొరత, తదితర సమస్యలతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది.

44,203 మంది విద్యార్థులు

జిల్లావ్యాప్తంగా 642 ప్రభుత్వ పాఠశాలల్లో 44,203 మంది చదువుతున్నారు. 64 ప్రభుత్వ పాఠశాలల్లో 10,213 మంది, 14 కేజీబీవీల్లో 2,748 మంది, 552 ఎంపీపీ, జెడ్పీపాఠశాలల్లో 24,974 మంది, 11 మో డల్‌ స్కూళ్లలో 6,205 మంది, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 63 మంది చదువుతున్నారు. 22 ప్రభు త్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 8,792 మంది ఉన్నారు. 332 ప్రైవేటు పాఠశాలల్లో 1,19,240 మంది విద్యనభ్యసిస్తున్నారు.

ఇన్‌చార్జిల పాలన

డీఈవో ప్రశాంత్‌రెడ్డి ఈనెల 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. కొన్నేళ్లుగా పూర్తిస్థాయి డీఈవో లేకపోవడంతో విద్యావ్యవస్థ గాడి తప్పింది. జిల్లాలో 15మండలాలకు ఇన్‌చార్జి ఎంఈవోలే కొనసాగుతున్నారు. సీనియర్‌ ప్రధానోపాధ్యాయులకే బాధ్యతలు అప్పగించారు. ఇద్దరు ఉప విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జి పాలనే నడుస్తోంది. కరీంనగర్‌, హుజూరాబాద్‌తో పాటు జిల్లా పరిషత్‌ డిప్యూటీ ఈవోలంతా ఇన్‌చార్జీలే. దీంతో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తున్నా ఫలితం దక్కడం లేదు.

టాయిలెట్లు ఉండవు.. ప్రహరీ లేదు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్లో మూత్రశాలలు, ప్రహరీ లేకపోవడం కీలకం. మల, మూత్ర విసర్జన వసతుల లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో ఇంటికి వెళ్తున్నారు. కనీస వసతులు లేకపోవడంతో పిల్లల్ని సర్కారు స్కూళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకురావడం లేదు. జిల్లావ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ప్రతి పాఠశాలలో టాయిలెట్లు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. 72 స్కూళ్లలో ప్రహరీ లేదు.

టీచర్లు... అప్‌ అండ్‌ డౌన్‌

జిల్లాలో ఉన్న ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 3వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పని చేసే చోటే ఉంటున్నవాళ్లు వెయ్యి లోపే. మిగతావాళ్లు జిల్లా, పట్టణ, మండల కేంద్రం నుంచి వచ్చి వెళ్తున్నారు. మారుమూల ప్రాంతాల బస్సు మిస్సయితే విధులకు ఎగనామం పెడుతున్నారు. ప్రార్థన తర్వాత కొందరొస్తే.. ఇంకొందరు ఓ పీరియడ్‌ పూర్తయిన తర్వాత వస్తున్నారు. ఈసారి సమయ పాలనపై జిల్లా విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

నత్తనడకన ‘మన ఊరు–మన బడి’

‘మన ఊరు– మనబడి’ ద్వారా జిల్లాలో 214 ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు 31.99 కోట్లతో పనులను 2021–22లో చేపట్టారు. ఇప్పటి వరకు 180 పాఠశాలల్లో పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ కమిటీలను రద్దు చేసిన ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను నియమించింది. జిల్లాలో 344 పాఠశాలల అభివృద్ధికి రూ.14.19 కోట్లు విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో చాలా చోట్ల పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వివరాలు

ప్రభుత్వ పాఠశాలలు 642

మొత్తం విద్యార్థులు 44,203

ఉపవిద్యాధికారుల ఖాళీ 02

మండల విద్యాధికారుల ఖాళీ 15

శిథిలావస్థలో ఉన్న గదులు 104

అవసరం ఉన్న మధ్యాహ్న భోజన షెడ్లు 62

నగరంలోని సవరన్‌ స్ట్రీట్‌లో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల ఇది. పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేకపోగా.. వంద మంది విద్యార్థినులకు ఒకేఒక్క మరుగుదొడ్డి అందుబాటులో ఉంది. దీంతో ఏటా విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది కూడా అధికారులు సమస్యను పరిష్కరించలేదు.

నగరంలోని రాంనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. తరగతి గదులపై ప్రమాద కరంగా భారీ వృక్షం ఉంది. గతంలో చెట్టు కొమ్మలు తరగతి గదులపై పడి పైకప్పు కూలింది. అయినా ఆ వృక్షాన్ని తొలగించకపోగా.. ఈ వానాకాలంలో మరోసారి ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement