సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య

Jun 11 2026 7:47 AM | Updated on Jun 11 2026 7:47 AM

ప్రవేశాల పెంపునకు బడిబాట

ఉత్తమ ఫలితాలే లక్ష్యం.. వసతులకు పెద్దపీట

జిల్లాలో 4,900 మంది విద్యార్థులను చేర్పించడమే లక్ష్యం

నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేటు పాఠశాలను సీజ్‌ చేస్తాం

‘సాక్షి’తో జిల్లా విద్యాధికారి ఎన్‌.ప్రశాంత్‌రెడ్డి

కరీంనగర్‌ టౌన్‌: ‘ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. ఉచిత పుస్తకాలు, దుస్తులు, రుచికరమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థలు, మాజీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ముందుకు రావాలి. జిల్లాలో 4,900 మంది విద్యార్థులను బడిబాటలో చేర్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రైవేట్‌ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తే వేటు తప్పదు. పుస్తకాలు, నోట్‌బుక్కులు పాఠశాలల్లో విక్రయించరాదు’ అని డీఈవో ఎన్‌.ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈనెల 15 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు.. ప్రైవేటు స్కూళ్ల నిబంధనల గురించి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు.

బడిబాట లక్ష్యం.. 4,900 అడ్మిషన్లు

జిల్లాలో నెల రోజులుగా బడిబాట కొనసాగుతోంది. ఈ ఏడాది 4,900 మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా ఈనెల 19వరకు కార్యక్రమం కొనసాగిస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరు, సౌకర్యాలను వివరిస్తున్నాం. జిల్లాలో చాలాచోట్ల స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ప్రత్యేక వాహనాలతో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పొందాలని ప్రచార జాతాలు నిర్వహించడం అభినందనీయం.

సౌకర్యాలకు పెద్దపీట

పాఠశాలల్లో సౌకర్యాలను కల్పిస్తున్నాం. మన ఊరు– మన బడి కింద గతేడాది రూ.31.99 కోట్లతో జిల్లాలోని 230 పాఠశాలల్లో వసతుల కల్పనకు పెద్దపీట వేశాం. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో 344 పాఠశాలల్లో వసతులు కల్పించాం. జిల్లాలో ఇంకా కొన్ని పాఠశాలల్లో వంటగదుల, ప్రహరీల నిర్మాణం, మూత్రశాలల సమస్య ఉంది. కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆధ్వర్యంలో వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులతో బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష జరిగింది. త్వరలోనే వసతుల సమస్య తీరనుంది.

15 నుంచే పుస్తకాలు అందిస్తాం

జిల్లాకు 16 మండలాలకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, వర్క్‌బుక్కులు అందజేశాం. ఎమ్మార్సీ కేంద్రాల నుంచి స్కూల్‌ పాయింట్‌కు చేరుకున్నాయి. ఈనెల 15న పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే అందరికీ పంపిణీ చేస్తాం. జిల్లాకు 3,07,990 ఉచిత పుస్తకాలు అవసరముండగా ఇప్పటికే 2,80,000 పుస్తకాలు చేరుకున్నాయి. రెండు రోజుల్లో పూర్తి పుస్తకాలు స్కూల్‌ పాయింట్‌కు వెళ్లనున్నాయి. ఇక ఉచిత దుస్తుల పంపిణీ సైతం జరుగుతుంది.

కొన్ని పాఠశాలలు రీ ఓపెన్‌

జిల్లావ్యాప్తంగా విద్యార్థులు లేకపోవడంతో 50పాఠశాలలు మూతపడ్డాయి. ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌, బడిబాట ద్వారా మూ తపడ్డ వీణవంక హైస్కూల్‌, హుజూరాబా ద్‌ మండలంలోని రెండు ప్రైమరీ స్కూళ్ల ను 15న తెరవబోతున్నాం. ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25శాతం సీట్ల కేటాయింపు అంశంపై స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తే అమలు చేస్తాం.

ఉపాధ్యాయుల కొరత లేదు

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొర త లేదు. గతేడాది సర్దుబాటు ద్వారా 300 మంది టీచర్లను అవసరమైన పాఠశాలలకు కేటాయించాం. విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే మిగులుగా ఉన్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణకు ప్రత్యేకంగా ఓ ఉపాధ్యాయుడిని నియమించి, జాగ్రత్తలు తీసుకునేలా సూచించాం. ఈ విద్యా సంవత్సరం నుంచి బ్రేక్‌ ఫాస్ట్‌ ఉంటుంది. విధివిధానాలు అందగానే ఏర్పాట్లు చేస్తాం.

ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, స్టేషనరీ విక్రయించొద్దు

ప్రైవేట్‌ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తే వేటు తప్పదు. పుస్తకాలు, నోట్‌బుక్కులు, టై, బెల్టు, షూ తదితర వస్తువులు పాఠశాలల్లో విక్రయించవద్దు. ఫిర్యాదులు వస్తే పాఠశాలలను సీజ్‌ చేస్తాం. అధిక ఫీజులు వసూలు చేయడం.. పిల్లల తల్లిదండ్రులను వేధిస్తే చర్యలు తప్పవు.

ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం

జిల్లాలోని ఉపాధ్యాయులకు గతంలోనే మూడు విడుతల్లో వృత్యంతర శిక్షణ ఇచ్చాం. విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించేందుకు అవసరమైన అంశాలను అవగాహన కల్పించి, సన్నద్ధం చేశాం. తాజాగా డిజిటల్‌ క్లాస్‌ రూంలు, కంప్యూటర్‌ ల్యాబ్‌ల నిర్వహణతో పాటు కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నే విధంగా టీచర్లు తర్ఫీదు పొందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement