● పిల్లల చదువుకు.. సాగు పెట్టుబడికి తండ్లాట
● పెరుగుతున్న ధరలతో సామాన్యుల బెంబేలు
● ప్రైవేటు పాఠశాలల్లో ‘ఫీజు’ల మోత ● రుణాల కోసం వేట
కరీంనగర్‌టౌన్: జూన్ అంటేనే పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నెలలోనే విద్యాసంస్థలు, వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. స్కూల్ ఫీజులతో పాటు బుక్స్, యూనిఫాంలు, పెన్నులు, పెన్సిళ్లతో పాటు ఇతర వస్తువుల ధరల విపరీతంగా పెరిగిపోయా యి. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి కోసం తిప్పలు పడుతున్నారు. ఫీజులు, పెట్టుబడికి అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
జేబుకు చిల్లు..
విద్యాసంవత్సరం ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రైమరీ, ఉన్నత పాఠశాలల పిల్లల చదువుకు వె చ్చించే ఖర్చులపై తల్లిదండ్రులు బేరీజు వేసుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థ ల యాజమాన్యాలు బెంబేలెత్తించే విధంగా వసూలు చేస్తున్న అడ్మిషన్, డొనేషన్ ఫీజులను చూసి జంకుతున్నారు. పుస్తకా లు, యూనిఫాం, బెల్ట్, టై, షూ, వాటర్‌బాటిల్స్, లంచ్‌బ్యాగు, పుస్తకాల బ్యాగు తదితర వస్తువుల కొనుగోలుతో జేబుకు చిల్లుపడనుంది. దీంతో ‘వామ్మో జూన్’ అంటూ తల పట్టుకుంటున్నారు.
జిల్లావ్యాప్తంగా సుమారు 350కు పైగా ప్రైవేటు పాఠశాలల్లో రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా ఫీజులున్నాయి. ఐఐటీ, ట్యూషన్, సాంస్కృతిక, కరాటే తదితర అంశాలు నేర్పించేందుకు అదనంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటిలో కొన్ని తోకల పేరుతో 1వ తరగతికే రూ.లక్షల్లో వసూలు చేయడం విశేషం. మరో నాలుగు రోజుల్లో బడిగంటలు మోగనున్న నేపథ్యంలో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో అప్పు చేసైనా పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు.
రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఖర్చులను అంచనా వేయడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టంగా మారింది. జూన్ వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే లెక్కలతో కుస్తీ పడుతుంటారు. తమ వద్ద ఉన్న డబ్బు ఎంత? కావాల్సింది ఎంత..? అప్పు ఎంత తీసుకురావాలి.. ఎవరి వద్ద తీసుకురావాఅనే ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ ఏడాది సదరు ఖర్చుల అంచనాలు లెక్క తప్పుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
ఏటా రైతులకు వ్యవసాయం చేయడం కూడా భారంగా మారుతోంది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండినా.. ధాన్యం డబ్బు చేతికి రాని దైన్యస్థితిలో రైతులు ఉన్నారు. ఇతరత్రా కూలీ పనులు దొరుకక గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వానాకాలం సీజన్‌కు ఎరువులు, విత్తనాల పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో సరిపడా రుణా లు లభించక, అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పిల్లల చదువులు, వ్యవసాయ ఖర్చులు అంచనా వేయలేని స్థితి ఏర్పడడంతో పేద, మధ్య తరగతి వారు సందిగ్ధంలో ఉన్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.500 నుంచి రూ.1,000 వరకు
ఎంట్రెన్స్ ఫీజు: రూ.400 నుంచి రూ.1,000 వరకు
అడ్మిషన్ ఫీజు రూ.3,000 నుంచి రూ.15,000 వరకు
స్పెషల్ ఫీజు రూ.3,000 నుంచి రూ.10 వేల వరకు


