వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. పత్తిపాడులోని ఫైర్ స్టేషన్ నుంచి ప్రధాన రహదారి మీదుగా అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి సుమారు 2,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. కార్యక్రమంలో కాకినాడ పార్టీ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, ప్రత్తిపాడు తుని పార్టీ పరిశీలకులు ఒమ్మి రఘురాం, వాసిరెడ్డి జమీలు, జెడ్పీటీసీ సభ్యులు గొల్లు చిన్న దిమానం, బెహరా రాజేశ్వరి, సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు, శిడగం వెంకటేశ్వరరావు, రామిశెట్టి నాని, నరాల శీను పాల్గొన్నారు.
జగ్గంపేట
నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త తోట నరసింహం ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుపై నిరసన ర్యాలీ జరిగింది. జగ్గంపేటలో స్థానిక బాలాజీ నగర్‌లో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి సుమారు 1,500 మందితో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్‌జీ ర్యాలీని ముందుండి నడిపించారు. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీ సుమారు రెండు కిలోమీటర్లు కొనసాగి జగ్గంపేట బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరింది. వైఎస్సార్ విగ్రహానికి పార్టీకి చెందిన ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి వైఫల్యాలపై, వెన్నుపోటు హామీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమన్వయకర్త తోట నరసింహం, ఇతర నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.
కాకినాడ సిటీ
పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కౌడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ఆధ్వర్యంలో స్థానిక డీ కన్వెన్షన్ నుంచి భానుగుడి సెంటర్, మెయిన్‌రోడ్డు మీదుగా జగన్నాథపురం అన్నమ్మఘాటీ సెంటర్ వరకూ ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 700 మంది కార్యకర్తలు, నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 200 బైక్‌లు 10 జీపులతో ఈ ర్యాలీ నిర్వహించారు. అన్నమ్మఘాటీ సెంటర్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ బీసీ సెల్ నాయకుడు అల్లి రాజుబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్‌కుమార్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.


