బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరించనందున ఉద్యోగులందరూ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఏపీ జేఏసీ అమరావతి.. జిల్లా యూనిట్ చైర్మన్ పితాని త్రినాథ్ అన్నారు. స్థానిక రెవెన్యూ భవన్‌లో జిల్లా యూనిట్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదని అన్నారు. పన్నెండో పీఆర్‌సీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు రూ.లక్ష మేర ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటానికి రాష్ట్ర కార్యవర్గం ప్రకటించే ఎలాంటి కార్యాచరణకై నా అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉద్యోగుల పే రివిజన్ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రెండు మూడు నెలల జీతాన్ని పన్నుల రూపంలో ఉద్యోగులు కోల్పోతున్నప్పటికీ సరెండర్ లీవ్‌లు కూడా చెల్లించడం లేదని, ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి కోరిన విధంగా ప్రతి ఉద్యోగి పేస్లిప్‌లో వారికి రావాల్సిన పీఆర్‌సీ, డీఏ బకాయిలు చూపించాలని అన్నారు. రాష్ట్ర కో చైర్మన్ పీఎస్‌ఎస్‌ఎన్ శాస్త్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగితో పాటు సమానంగా చైల్ట్‌కేర్ లీవ్ కూడా రెండు సంవత్సరాలకు పెంచాలని కోరారు.


