దేవీపట్నం/సీతానగరం: రంపచోడవరం మండలం నుంచి పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన గంగంపాలెం, దండంగి చేరిన పులి.. రెండు రోజులుగా నేలకోట వద్ద రామవరపును ఆనుకుని ఉన్న కొండపైనే తిష్ట వేసింది. కొండ నుంచి దక్షిణం వైపునకు దిగితే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం పులి సంచరిస్తున్న ప్రాంతం పాపికొండల నేషనల్ పార్కు పరిధిలో ఉంది. ఇక్కడ దానికి మత్తు మందు ఇచ్చి బంధించే అనువైన పరిస్థితులు లేవు. ఒక వేళ సీతానగరం మండలం వైపు వెళితే మత్తు మందు ఇవ్వడం సులభతరమవుతుంది. పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో పులి ఉండడంతో ఇరు జిల్లాలకు చెందిన అటవీ అధికారులు ఇరుపక్కలా మోహరించారు. దాని మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా గమనాన్ని పరిశీలిస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితం రామదుర్గం కొండపై అడవి పందిని వేటాడి దాని కళేబరంతో పులి ఆడుకుంటున్న చిత్రం డ్రోన్ వీడియోల ద్వారా లభ్యమైంది.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో మంగళవారం రైల్వే పట్టాలు వద్ద గుర్తు తెలియని సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే సీఐ వైవీ రమణ తెలిపిన కథనం ప్రకారం... సుమారు మూడు రోజుల క్రితం రైలు ఢీకొని కానీ , మరే ఇతర కారణంగానైనా వ్యక్తి చనిపోయి ఉండవచ్చన్నారు. 5.4 అడుగులు ఎత్తు, ఒంటిపై బ్లాక్ అండ్ వైట్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బూడిద రంగు నిక్కరు ఉన్నాయన్నారు. వివరాలు తెలిసినవారు 94948 19898కు సమాచారం ఇవ్వాలని కోరారు.


