ఇరాన్ మాజీ యువరాజుపై దాడి.. | red liquid thrown on iran exiled prince reza pahlavi | Sakshi
Sakshi News home page

ఇరాన్ మాజీ యువరాజుపై దాడి..

Apr 24 2026 12:37 PM | Updated on Jul 29 2026 11:00 AM

 red liquid thrown on iran exiled prince reza pahlavi

ఇరాన్ బహిష్కృత యువరాజుపై బెర్లిన్‌లో దాడి జరిగింది. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు ఎరుపురంగు ద్రవాన్ని మీద చల్లారు. అయితే వెంటనే ఆయన రక్షణ సిబ్బంది స్పందించి ఆందోళనకారుడిని ప్రక్కకు తోశారు.

రెజా పహ్లావి గురువారం బెర్లిన్‌లో ఒక భవనం నుండి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో పహ్లావి తన భద్రతా సిబ్బందితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు.  వెనుక నుండి వచ్చిన ఒక వ్యక్తి తన బ్యాగ్ నుంచి ఎరుపు రంగు ద్రవాన్ని (ఇది టమోటా జ్యూస్ అని భావిస్తున్నారు) ఆయనపై విసిరాడు. దీంతో ఆ ఎరుపు ద్రవం పహ్లావి తల వెనుక భాగం, మెడ మరియు ఆయన ధరించిన బ్లేజర్‌పై పడింది. అయితే ఈ హఠాత్‌ పరిణామంతో ఏ మాత్రం సంబంధం లేకుండా  చాలా ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే రెజాపహ్లవిపై దాడి చేసిన వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే పహ్లవి విలేకరుల సమావేశం నిర్వహించారు.  అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు: ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తుల్ని గూండాలు, ఉగ్రవాదులుగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశాలన్ని ఇరాన్ పాలనపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, కేవలం యధాతథ స్థితిని కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ఖైదీల విడుదల, ఉరిశిక్షల నిలిపివేత విషయంలో ఐరోపా దేశాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

రెజా పహ్లవీ నేపథ్యం

కాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో  మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్‌లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. దీంతో ‍అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు. 

ప్రస్తుతం  ఇరాన్‌లో ఉన్న ఇస్లామిక్ పాలన అంతం కోసం ఆయన పోరాడుతున్నారు. ఇరాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక జోక్యాన్ని ఆయన సమర్థిస్తున్నారు. అయితే ఇరాన్ లోపల ఆయనకు ఎంతవరకు మద్దతు ఉందనేది తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement