పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నామని చెప్పిన ఆయన.. అమెరికాకు ఈ డీల్ ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన గాల్లో కోటలు కట్టుతున్నాడంటూ ఇరాన్ ఎద్దేవా చేసింది.
శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ గురువారం వైట్‌హౌజ్‌లో ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయని.. ఈ ఒప్పందం కుదిరితే అమెరికాకు ఉచితంగా చమురుతో పాటు హర్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛా రవాణాకు వీలు ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్‌ఐబీ (Islamic Republic of Iran Broadcasting) వెటకారంగా స్పందించింది.
ట్రంప్ గాల్లో కోటలు కడుతున్నారంటూ ఆయన మాట్లాడిన వీడియోతో ఐఆర్‌ఐబీ ఓ పోస్ట్ చేసింది. దీనికి అదనంగా ఓ పర్షియన్ సామెతను ఉటంకించింది. ‘‘ఒంటె పత్తి గింజల గురించి కలలు కంటుంది. కొన్నిసార్లు వాటిని ఒక్కసారిగా మింగేస్తుంది, కొన్నిసార్లు ఒక్కొక్కటిగా తింటుంది. ట్రంప్ కూడా అంతే. ఆయన ఊహాలోకంలో విహరిస్తున్నారు’’ అంటూ సెటైర్ వేసింది.
Building castles in the air!
Or in Persian we have a similar proverb:
'The camel dreams of cottonseed; sometimes gulping it down, sometimes eating it grain by grain!'
شتر در خواب بیند پنبهدانه
گهی لپلپ خورد گه دانه دانه pic.twitter.com/HA15h1aQVU— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) April 16, 2026
సాధారణంగా.. సాధ్యంకాని విషయాలను కలలు కనే వ్యక్తులను ఎగతాళి చేయడానికి ఈ పర్షియన్ సామెతను వాడుతుంటారు. విశేషం ఏంటంటే.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఈ సామెతను ఉపయోగించారు. ఆయన 2026 ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తనయుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు.
అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీల్ కుదిరితే.. పాకిస్థాన్‌కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో తానూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. అంతేకాదు.. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు కూడా తాను సిద్ధమేనని అంటున్నారు. ఈ నెల 22వ తేదీతో ఆ గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.


