భారత నౌకలపై ఇరాన్‌ కాల్పులు! | firing on two India-flagged ships in the Strait of Hormuz | Sakshi
Sakshi News home page

భారత నౌకలపై ఇరాన్‌ కాల్పులు!

Apr 19 2026 5:44 AM | Updated on Apr 19 2026 5:44 AM

firing on two India-flagged ships in the Strait of Hormuz

కేంద్రం ఆగ్రహం, రాయబారికి సమన్లు

హార్మూజ్‌ దాటి భారత్‌ దిశగా ఒక నౌక

హార్మూజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్‌ 

అమెరికా దిగ్బంధానికి నిరసనగానే 

త్వరలో ఒప్పందానికి రండి: ట్రంప్‌ 

లేదంటే ఇరాన్‌పై బాంబుల వర్షమే 

కాల్పుల విరమణ ఒప్పందానికీ తెర! 

అధ్యక్షుని హెచ్చరికలతో ఉద్రిక్తతలు

కైరో/న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మూజ్‌ వద్ద ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరుతున్నాయి. ఆ జలసంధిని తెరిచినట్టు ఇరాన్‌ శుక్రవారం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్మూజ్‌ను దాటుతున్న రెండు భారత చమురు నౌకలపై శనివారం ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌జీసీ)కి చెందిన స్పీడ్‌ బోట్లు కాల్పులకు దిగాయి. 

దాంతో అవి జలసంధిని దాటకుండానే వెనుదిరిగినట్టు అంతర్జాతీయంగా నౌకల రాకపోకలను ట్రాక్‌ చేసే టాంకర్‌ట్రాకర్స్‌ డాట్‌కామ్‌ తదితర సంస్థలు వెల్లడించాయి. వాటిలోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో ఇరాన్‌ రాయబారి మొహమ్మద్‌ ఫతాలీకి సమన్లు జారీ చేసింది. అంతేగాక ఇరాన్‌ చర్యపై తీవ్ర నిరసన కూడా వెలిబుచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

ఐఆర్‌జీసీ కాల్పులతో మరో నాలుగు భారత చమురు నౌకలు హార్మూజ్‌ను దాటకుండానే వెనుదిరిగాయి.  చమురు, సహజవాయువు, ఎరువుల నిల్వలతో కూడిన 13 భారత నౌకలు ప్రస్తుతం జలసంధి వద్ద చిక్కుబడి ఉన్నాయి. అవి సురక్షితంగా హార్మూజ్‌ దాటేలా ఇరాన్‌తో భారత్‌ సంప్రదింపులు జరుపుతోంది. అయితే ‘దేశ్‌ గరిమ’ అనే చమురు నౌక శనివారం హార్మూజ్‌ను దాటి భారత్‌వైపు బయల్దేరినట్టు తెలుస్తోంది.

 మరోవైపు హార్మూజ్‌ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్టు ఇరాన్‌ తాజాగా ప్రకటించింది. తమ ఓడరేవుల దిగ్బంధానికి అమెరికా స్వస్తి పలకని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దిగ్బంధం కొనసాగినంత కాలం హార్మూజ్‌ను తెరవబోమని ప్రకటించింది. దీనికి తోడు ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బెదిరింపులకు దిగారు. 

త్వరలో ఒప్పందానికి రానిపక్షంలో కాల్పుల విరమణ పొడిగింపు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. అంతేగాక ఇరాన్‌పై మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామని తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. అణు కార్యక్రమంతో పాటు అన్ని అంశాలపైనా ఇరాన్‌ తమతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకునేదాకా ఆ దేశ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతుందని కూడా అధ్యక్షుడు స్పష్టం చేశారు. దాంతో పశి్చమాసియాలో పరిస్థితులు మళ్లీ విషమించేలా కన్పిస్తున్నాయి. 

త్వరలో చర్చలు! 
అమెరికా, ఇరాన్‌ నడుమ మరో దఫా శాంతి చర్చల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు పాకిస్తాన్‌ వెల్లడించింది. ఆ రెండు దేశాల నడుమ కాల్పుల విరమణ ఏప్రిల్‌ 22తో ముగుస్తుండటం తెలిసిందే. ఆ లోపే చర్చలు జరిగే అవకాశమున్నట్టు పాక్‌ పేర్కొంది. చర్చల నిమిత్తం పంపిన అమెరికా నూతన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కూడా వెల్లడించింది.  

ఇప్పటిదాకా 23 నౌకలు వెనక్కు 
ఇరాన్‌ ఓడరేవులను దిగ్బంధించినప్పటి నుంచీ ఇప్పటిదాకా హార్మూజ్‌ జలసంధి వద్ద 23 నౌకలను అడ్డగించి వెనక్కు పంపినట్టు అమెరికా పేర్కొంది. ఆ దేశ సెంట్రల్‌ కమాండ్‌ ఎక్స్‌ పోస్టులో ఈ మేరకు వెల్లడించింది. ఇరాన్‌ ఓడరేవులతో పాటు ఆ దేశ తీర ప్రాంతమంతటా నౌకల రాకపోకలపై నిషేధం పూర్తిస్థాయిలో కొనసాగుతున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 13న అమెరికా సైన్యం ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధానికి దిగింది.

తీవ్ర పోరుకు సిద్ధం: మొజ్తబా 
శత్రువులపై తీవ్ర పోరాటానికి ఇరాన్‌ సిద్ధంగా ఉందని ఆ దేశ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. వారికి భారీ ఓటమి రుచి చూపేందుకు ఇరాన్‌ నావికా దళం ఇప్పటికే సర్వ సన్నద్ధంగా ఉందని శనివారం విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. ఇరాన్‌ సైన్యం వ్యవస్థాపక దినం సందర్భంగా సాయుధ దళాలకు ఆయన శుభాకాంక్షలు అందజేశారు. పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై సైన్యం చేపట్టిన డ్రోన్‌ దాడులను ప్రత్యేకంగా ప్రశంసించారు.  

లెబనాన్‌లో శాంతిదళాలపై కాల్పులు 
→ ఒక ఫ్రెంచి సైనికుని మృతి 
→ హెజ్బొల్లా పనేనన్న మాక్రాన్‌ 
పారిస్‌: లెబనాన్‌లో ఐరాస శాంతి పరిరక్షక దళంపై శనివారం జరిగిన కాల్పుల్లో ఒక ఫ్రెంచి సైనికుడు మృతి చెందాడు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఈ మేరకు వెల్లడించారు. తమ దేశానికి చెందిన మరో ముగ్గురు సైనికులు గాయపడ్డట్టు తెలిపారు. దక్షిణ లెబనాన్‌లో శనివారం ఉదయం ఈ ఉదంతం చోటుచేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇది హెజ్బొల్లా మిలిటెంట్‌ సంస్థ పనేనని ఇప్పటిదాకా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నట్టు సోషల్‌ మీడియా పోస్టులో మాక్రాన్‌ వివరించారు. ఇందుకు బాధ్యులైన వారిని లెబనాన్‌ ప్రభుత్వం తక్షణం అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

యురేనియం అప్పగించబోం: ఇరాన్‌ 
శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించే ప్రసక్తే లేదని ఇరాన్‌ కుండబద్దలు కొట్టింది. వాటిని అప్పగించేందుకు ఇరాన్‌ అంగీకరించిందనే అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వాటిని ఇరాన్‌ విదేశాంగ శాఖ ఉప మంత్రి సయీద్‌ ఖతీబ్‌జాదే పూర్తిగా ఖండించారు. అంతేగాక, ‘‘అమెరికా మితిమీరిన అహంకారంతో వ్యవహరిస్తోంది. కనుక ఆ దేశంతో మరో దఫా చర్చలకు ఇరాన్‌ సిద్ధంగా లేదు’’అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌ వద్ద 440 కిలోలకు పైగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నట్టు అంచనా.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement