అల్విదా కామ్రేడ్‌! | Tribute to Telidevara Bhanumurthy By AK Prabhakar | Sakshi
Sakshi News home page

తెలంగాణా పలుకుబడిలో అధిక్షేప శిల్పి

Apr 30 2026 12:48 PM | Updated on Apr 30 2026 1:16 PM

Tribute to Telidevara Bhanumurthy By AK Prabhakar

నివాళి

ఇప్పుడంటే తెలంగాణ భాషలో కవిత్వం కథ నవల రాయటం అతి సాధారణమైంది గానీ 70వ దశకంలో అది అపురూపం. పి.యశోదా రెడ్డి (మా వూరి ముచ్చట్లు) లాంటి వారు చేసిన ప్రయోగాలు తెలంగాణ భాషా ప్రేమికుల్ని అబ్బురపరిచాయి గానీ అంత ప్రాచుర్యం పొందలేదు. విప్లవోద్యమంలో భాగంగా అల్లం రాజయ్య వంటి వారి రచనలు వెలువడ్డ తర్వాతే తెలంగాణ మాండలికానికి సాహిత్య గౌరవం లభించింది. సరిగ్గా అటువంటి రోజుల్లోనే పంచరెడ్డి లక్ష్మణ (ఇసిత్రం), దేవరాజు మహారాజు (గుడిసె గుండె), భాను (ఊరోల్లు), కృష్ణమూర్తి యాదవ్‌ (తొక్కుడు బండ) తెలంగాణ గ్రామీణ భాషలో కవిత్వం రచించి మెప్పించారు. వాటిలో కవిత్వం కంటే భాషే సంచలనం సృష్టించింది. 1969 నాటి తొలి దశ ప్రత్యేక తెలంగాణ వుద్యమ ప్రభావం నుంచే యీ గొంతులు విచ్చుకున్నాయని నా అభిప్రాయం.

‘తెలంగాణ మాండలిక కథా సాహిత్యం’పై నా పరిశోధనలో భాగంగా  ‘భాను’ పూర్తి పేరు తెలిదేవర భానుమూర్తి (Telidevara Bhanumurthy) అనీ, ఆయన బేగంపేట బ్రాహ్మణవాడి రాములు కాంపౌండ్‌ యెదురుగా మిద్దె మీద వుంటాడనీ తెలుసుకుని యింటి తలుపు తట్టాను. ఎదురుగా నాలాగే వొక బక్క పలచని మనిషి. సూటైన ముక్కు ముందుగా పలకరించింది. అప్పటికే ఆయన ‘ఉదయం’లో పనిచేస్తున్నాడని జ్ఞాపకం. తెలంగాణ యాసని ఆయన గొంతులోనే వినడం బాగుండేది. ‘పలుకుబడి’ మీద మా సంభాషణ నడిచేది. భానుమూర్తి మితభాషి, ఇంట్రావర్ట్‌. స్నేహం బలపడిన తర్వాతే ఓపెన్‌ అయ్యాడు. భిన్న ప్రాంతాల భాషలకు యాసలకు వేదిక కల్పించిన ఉదయంలో ‘పతంజలి భాష్యం’ సీరియస్‌ రచనగా వస్తే, భానుమూర్తి ‘పలుకుబడి’ హాస్య వ్యంగ్యాల మేళవింపుగా నడిచేది. ఇది పొలిటికల్‌ సెటైర్‌. అంత దీర్ఘకాలం వచ్చిన శీర్షిక అప్పటికీ యిప్పటికీ మరొకటి లేదేమో!

ఉదయం మూతపడ్డాకా ‘వార్త’లో కొనసాగింది. సమకాలీన రాజకీయ అంశాలపై ఆయన సంధించిన అస్త్రాలు సూటిగా తాకేవి. అందులో హాస్యం కంటే అధిక్షేపం యెక్కువ. అధికార పీఠంలో యే పార్టీనీ అతను స్పేర్‌ చేయలేదు. సాధారణంగా దీర్ఘకాలం నడిచిన శీర్షికలు మొనాటినీకి గురవుతాయి. అలా జరగకుండా భానుమూర్తి జాగ్రత్తగా వుండేవాడు. సమకాలీన సమాజాన్ని శాసించే కేరికేచర్‌ రాజకీయాలు (Political Caricature) అతని కాలమ్‌ను నిత్య నూతనంగా వుంచేవి.

కవులు రచయితలు తెలంగాణ యేర్పడ్డాక అదృశ్య రాజకీయ కండువాలు ధరించి అవార్డులకు, సన్మానాలకు పాకులాడినప్పుడు కూడా భానుమూర్తి రాజీపడలేదు. తెలంగాణ రచయితల వేదిక హైదరాబాదు బాధ్యుడిగా వ్యవహరిస్తూ ప్రజల గొంతుని వినిపించాడు. రాతలో యెంత కటువుగా వున్నా మాటల్లో మృదుత్వం కాపాడుకున్నాడు. అల్లం రాజయ్య (Allam Rajaiah) లాంటివారి విప్లవోద్యమ రచనల ద్వారా తెలంగాణ మాండలికం సీరియస్‌ పాఠకుల్లో మాత్రమే ప్రచారమైతే గద్దర్, గూడ అంజయ్యల పాటల్లాగే భానుమూర్తి ‘చల్నే దో బాలకిషన్‌’ శీర్షిక ద్వారా తెలంగాణ పలుకుబడి ఆంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సైతం ఆదరణ పొందింది. ఒకసారి తన శీర్షికను మెచ్చుకుంటూ తెలంగాణేతర ప్రాంతం నుంచి తెలంగాణ భాషలో రాసిన వుత్తరం చదివి వినిపించి యెంత మురిసిపోయాడో!

జానపద విజ్ఞానవేత్త జయధీర్‌ తిరుమలరావు ‘తొవ్వ ముచ్చట్లు’ అంటే భానుమూర్తికి అమిత అభిమానం. జర్నలిస్టుగా రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత భానుమూర్తి ఆయనతో ఫీల్డ్‌ వర్క్‌కి తిరిగేవాడు. జయధీర్‌ తన ఆద్యకళకు సామగ్రి సేకరిస్తే భానుమూర్తి తన రచనలకు వస్తువులు వెతుక్కునేవాడు. అనారోగ్యంతో వుండి కూడా జానపద శైలిలో రచించిన ‘లత్కోర్‌ సాబ్‌’ ఆ క్రమంలోనే పుట్టింది. శీర్షికలో చెప్పలేని జీవితాన్ని తెలిదేవర కథల ద్వారా వ్యాఖ్యానించాడు. కాలమ్‌లో వాడే హాస్య శైలి ప్రభావం అతని కథలపై కూడా యేదో మేరకు పడింది. ‘ఎన్కౌంటర్‌’ వంటి సీరియస్‌ కథల్లో కూడా దీన్ని గమనించవచ్చు.

చ‌ద‌వండి: ఒక్క నాట‌కంతో బంగళాలు, ఖ‌రీదైన కార్లు!

పుట్టింది భువనగిరి (Bhuvanagiri) అయినప్పటికీ చదువు వుద్యోగాల రీత్యా నగరంలో వుండటం వల్ల అతని రచనల్లో పక్కా హైదరాబాదీగా సాక్షాత్కరించేవాడు. అన్ని ప్రాంతాలవారికి చేరువ కావడానికి అతను ఆ టెక్నిక్‌ అనుసరించాడేమో! అలాగే కవిత్వ భాషకీ కథల భాషకీ శీర్షిక భాషకీ వైవిధ్యం పాటించాడు. ఈ అంశంపై అధ్యయనం చేస్తే సృజనాత్మక సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యం సాహిత్య భాషని యెలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోగలం.

అందుకు భానుమూర్తి సమగ్ర రచనల్ని వొకచోట చేర్చి ప్రచురించాలి. తెలంగాణ భాషా చాంపియన్‌కి మనమిచ్చే నివాళి అదే. అల్విదా కామ్రేడ్‌!

– ఎ.కె. ప్రభాకర్‌ 
సాహిత్య విమర్శకుడు 

Advertisement
 
Advertisement
Advertisement