ఒక్క నాట‌కంతో బంగళాలు, ఖరీదైన కార్లు! | Hyderabad theatre icon Babban Khan Tribute | Sakshi
Sakshi News home page

Babban Khan: స్టేజీ మాంత్రికుడు

Apr 21 2026 7:41 PM | Updated on Apr 21 2026 7:58 PM

Hyderabad theatre icon Babban Khan Tribute

ఇన్‌ బాక్స్‌

‘అద్రక్‌ కే పంజే’ నాటకానికి అన్నీ తానే అయి దేశదేశాల్లో ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు పొందిన బబ్బన్‌ ఖాన్‌ హైదరాబాద్‌లో ఈ నెల 17న కన్నుమూశారు. 1980–90 కాలంలో ‘దక్కన్‌ క్రానికల్‌’లో సినిమా ప్రకటనలతో పాటు ‘అద్రక్‌ కే పంజే’ ప్రదర్శన సమాచారం వచ్చేది. రవీంద్ర భారతిలో నెల రోజుల పాటు రోజుకు రెండు షోలు ఉంటాయనీ, షో వేళలు, టికెట్ల రేట్లు, తదితర వివరాలు ఆ ప్రకటనలో ఉండేవి. 60 దేశాల్లో 14 భాషల్లో 10 వేలకు పైగా ఈ నాటక ప్రదర్శనలు కొనసాగాయి.

అంతగా ఈ నాటకం ప్రజాదరణ పొందడానికి కారణం సమకాలీన సామాజిక అంశాలపై బబ్బన్‌ పేల్చే వ్యంగ్య సంభాషణలే. ముందస్తు స్క్రిప్ట్‌ లేకుండా ఏ రోజుకారోజు కొత్త విషయాలను చేర్చుకుంటూ ప్రేక్షకులను అలరించడమే దీని ప్రత్యేకత. అల్లపు కొమ్ములు అడ్డదిడ్డంగా పెరగడాన్ని నేటి సమాజపు పోకడకు అన్వయించేలా నాటకానికి ఆ పేరు పెట్టారు. బ్యాంక్‌ క్లర్క్ కుటుంబ నేపథ్యంలో సాగే ఈ నాటకంలో బబ్బన్‌ ప్రధాన పాత్రధారి. భార్య, పిల్లలు, ఇంటికి వచ్చిపోయేవాళ్ల పాత్రలను ఆయన కుటుంబ సభ్యులే వేసేవారు. ఇంటి కిరాయి, పాల బిల్లు,  పిల్లల ఫీజులు, కిరాణా వస్తువులకు ఆదాయం సరిపోక పడే ఇబ్బందులే ప్రధాన అంశాలు.

హైదరాబాద్‌లో 1943లో జన్మించిన బబ్బన్‌ ఖాన్‌ (Babban Khan) బాల్యం నుండే పేదరికాన్ని అనుభవించాడు. ఆయన కన్నా ముందు పుట్టిన పిల్లలు పౌష్టికా హార లోపంతో చనిపోయారు. ఇతను కూడా బతుకుతాడనే నమ్మకం లేక ఆయనకు పేరు పెట్టలేదు. ముద్దుగా బబ్బన్‌ అని పిలుచుకొనేవారు. పదేళ్లు బతికాక అదే పేరు ఖాయం అయింది. ఆరేళ్లకే తండ్రిని కోల్పోయిన బబ్బన్‌ ఇంట్లో కరెంటు లేనందువల్ల వీధి దీపం కింద కూచొని 22వ ఏట ఈ నాటకాన్ని మూడు గంటల వ్యవధిలో రాశాడు.

చ‌ద‌వండి: 'మూసీ న‌ది బాగుప‌డాలంటే చేయాల్సింది ఇది'

తల్లి మెడలో ఉన్న ఒకే ఒక బంగారు నగని అమ్మేసి, వచ్చిన సొమ్ముతో తొలి ప్రదర్శనను 1965లో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేశాడు. ఆనాటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. పేదరికంలో పుట్టిన బబ్బన్‌ను ఈ నాటక విజయం బంగళాలు, ఖరీదైన కార్లు కొనే స్థాయికి తీసికెళ్ళింది. 1984లోనే అయిదు వేలకు పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకొని గిన్నిస్‌ బుక్‌లో చేరింది. మార్గరెట్‌ థాచర్, నెల్సన్‌ మండేలా, ఇందిరా గాంధీ వంటి ప్రముఖులు దీన్ని తిలకించారు. బబ్బన్‌ ఖాన్‌ ఒక్కరే చేయగల నాటకం అద్రక్‌ కే పంజే!

– బద్రి నర్సన్‌ 
కవి–కథకుడు 

Advertisement
 
Advertisement
Advertisement