టవర్లు దిగాల్సిన ఏపీ ‘క్వాంటమ్‌ టెక్‌’ | Sakshi Guest Column On Chandrababu Quantum Computers Scam | Sakshi
Sakshi News home page

టవర్లు దిగాల్సిన ఏపీ ‘క్వాంటమ్‌ టెక్‌’

Apr 27 2026 10:26 AM | Updated on Apr 27 2026 10:26 AM

Sakshi Guest Column On Chandrababu Quantum Computers Scam

ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త పాలసీ అమలు చేయాలంటే, దాన్ని ప్రభుత్వ శాఖలు పాటించేట్టుగా చేయాలా,‘ప్రైవేట్‌’గా అయినా ఫర్వాలేదా అనే చర్చకు ఆంధ్రప్రదేశ్‌ వేదికైంది. చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీ ‘కూటమి’తో కలిశాక, ఈ ‘ప్రైవేట్‌’ ధోరణి మరింత స్పష్టంగా ఉంది. ఏదైనా ఇది ‘ప్రైవేట్‌’గా ఉందేమీ అనిపిస్తే... అది రాజధానికి కోసం కదా, అని ఎవరికి వారు జవాబు చెప్పుకోవలసి వస్తున్నది. అమరావతిలో ఇండియాలో తొలి ‘క్వాంటమ్‌ వ్యాలీ’ అన్నప్పుడు... ‘యూజర్లు’ రాష్ట్రంలో లేక దానిపై పెద్దగా చర్చకాలేదు. ఎక్కడైనా ఒక కొత్త ‘టెక్‌ ఫెసిలిటీ’ వస్తుందంటే, దానిపై స్పందించేది ‘యూజర్ల’ కంటే ముందు ఆ ‘ట్రేడింగ్‌ కమ్యూనిటీ’. మరి పరిశ్రమ రంగానికి ‘సీఐఐ’ లాగా సాఫ్ట్‌వేర్‌ రంగానికి ‘నాస్కామ్‌’ ఉన్నా దీనిపై దాని స్పందన లేదు. 

ఏప్రిల్‌ 14న ఏపీలో జరిగిన ఈ ప్రారంభానికి ఢిల్లీ ఐటీ మంత్రిత్వశాఖ నుంచి ఇద్దరు అధికారులు, చెన్నై ఐఐటీ నుంచి ఒక ప్రొఫెసర్‌ హాజరయ్యారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌ అండ్‌ టీ భాగస్వామ్యం ఇందులో ఉందని చెబుతున్నా, ‘నాస్కామ్‌’ ఊసు లేకపోవడంతో ఇది – ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో ‘అకడమిక్స్‌’కే పరిమితమా అనే పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం మంగళగిరి సమీపంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలోనూ, గన్నవరం మేధా టవర్స్‌ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లోనూ ‘క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెస్ట్‌ బెడ్స్‌’ ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది.  

ఈ ప్రారంభానికి నాలుగు రోజులు ముందు సీఎంవో అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, పాత ‘క్లాసికల్‌ కంప్యూటర్‌ చేసేవన్నీ ‘క్వాంటమ్‌ కంప్యూటర్‌’ చేస్తుందనీ, కానీ ఇది వేగంగా ‘అపరేషన్స్‌’ పూర్తిచేస్తుందనీ, ఇది వచ్చాక కూడా పాత ‘కంప్యూటింగ్‌’ విధానం ఉంటుందనీ, కృత్రిమ మేధ, రక్షణ, కమ్యూనికేషన్, మెరుగైన హెల్త్‌ కేర్‌ టెక్నాలజీకి ఇది దోహదపడుతుందనీ అన్నారు. టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు అంటే, అదెప్పుడు రావాలని కోరుకునేదే. అయితే, దేశంలోకి దీన్ని తెచ్చే ‘క్రెడిట్‌’ ముందు ఏపీ తీసుకోవాలి అనుకుంటే, క్షేత్రస్థాయిలో దీని వినియోగం (అప్లికేషన్‌) విషయంలో కూడా ప్రభుత్వం ముందుగానే కసరత్తు చేయాల్సింది. 

అప్రమత్తత ఉందా?
ఇలా అనడానికి కారణం ఉంది. హెల్త్‌ కేర్‌ టెక్నాలజీ అన్నప్పుడు, మనకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వద్ద ‘కిడ్నీ’ రోగుల సమస్య ఉంది. మార్కాపురం వద్ద ‘ఫ్లోరైడ్‌’ సమస్య ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ‘డేటా’లో తేడాల విషయం తరుచూ కేంద్రం సమీక్షలకు గురవుతూ ఉంది. వీటిని ‘క్వాంటమ్‌ కంప్యూటింగ్‌’ ద్వారా ‘రియల్‌ టైమ్‌’లో సరిచేయడానికి సమాంతర ప్రయత్నం జరిగితే, ‘అది పై నుంచి కిందికి’ అనే అనుసరణీయ సూత్రంవర్తించే నిర్ణయం అయ్యుండేది. ఇక్కడే మాట్లాడుకోవలసిన విషయం మరొకటి ఉంది. కొత్త ‘టెక్నాలజీ’ని తీసుకు రావడమంటే, ప్రభుత్వాలు ఎంత అప్రమత్తతతో ఉండాలో గ్రహించే సందర్భం కూడా అనుకోకుండా ఇదే తేదీల్లో సంభవించింది. జరిగింది ఏమిటి? ‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్’ (ఏఐ) రంగంలో కీలక పరిణామంగా ‘ఆంత్రోపిక్‌’ తన కొత్త ఏఐ మోడల్‌ ‘క్లాడ్‌ మిథోస్‌ ప్రివ్యూ’ను ఐటీ మార్కెట్లోకి తెచ్చింది. 

ఇది అత్యంత శక్తిమంతమైన మోడల్‌ అని ఆ కంపెనీ చెబుతున్నది. అది నిజం కావొచ్చు, అయితే దీని అసాధారణ సామర్థ్యాలు సైబర్‌ భద్రతా ప్రమాదాలను పెంచే అవకాశముండటంతో, ప్రజలకు దీని విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ మోడల్‌ను విడుదల చేయకుండా ‘ఆంత్రోపిక్‌’ కంపెనీ ‘ప్రాజెక్ట్‌ గ్లాస్‌వింగ్‌’ అనే కొత్త ‘ప్రాజెక్టు’ను దీని పనితీరు మదింపు కోసం చేస్తున్నది. భారత ఐటీ రంగ ప్రధాన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ అయిన ‘నాస్కామ్‌’ పరిధిలో పనిచేసే ‘డాటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ సీఈఓ వినాయక్‌ గాడ్సే దీని గురించి చెబుతూ – ‘సైబర్‌ దాడులకు ప్రభుత్వ శాఖల ఐటీ సిస్టం తేలికైన లక్ష్యాలు అవుతాయి. ఎందుకంటే, వాటి సెక్యూరిటీ సిస్టం కూడా పలు మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, శాఖల మధ్య విస్తరించి పలు స్థాయుల్లో అది పనిచేయాల్సి ఉంటుంది’ అంటున్నారు. 

ఇది జరిగాక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌– ఆర్బీఐ, ప్రభుత్వ బ్యాంక్‌ చైర్మన్లు, ఎలక్ట్రానిక్స్‌ – ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖాధికారులతో సమావేశమై ‘ఆంత్రోపిక్‌’ వల్ల మన బ్యాంకు లావాదేవీలకు వాటిల్లే సమస్య గురించి అప్రమత్తం చేశారు. ఎంతో రీసెర్చి దన్ను ఉండే కేంద్ర మంత్రిత్వశాఖ ఒక కొత్త ‘టెక్నాలజీ’ అమలుపై ఇలా ఆచితూచి అడుగులు వేస్తుంటే; ఏపీ సీఎం అమరావతిలో ‘క్వాంటమ్‌ వ్యాలీ’ కోసం రెండు ‘టవర్లు’ కడతాము అంటున్నారు. రాజధాని అంటే – ఏపీ సీఎం దృష్టిలో అది ప్రజల కోసమా లేక ‘కార్పొరేట్‌’ ప్రయోజనాల కోసమా అనే చర్చకు దారితీసే చర్యలివి. ఏప్రిల్‌ 14 అంటే, గతంలో డా‘‘ అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమాలు ఉండేవి. కానీ ఏపీలో అది– ‘వరల్డ్‌ క్వాంటమ్‌ డే’ అయింది. 


వ్యాసకర్త సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల వ్యాఖ్యాత 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement