‘ఓపెన్ఏఐ’ సంచలనం.. రూ. 845 కోట్లతో అల్జీమర్స్‌పై యుద్ధం | Sam Altman Announces $100 Million AI Push To Help Find Cure For Alzheimer Disease, More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఓపెన్ఏఐ’ సంచలనం.. రూ. 845 కోట్లతో అల్జీమర్స్‌పై యుద్ధం

Apr 28 2026 12:31 PM | Updated on Apr 28 2026 1:20 PM

OpenAIs 100M Bet Can AI Cure Alzheimers

లండన్‌: వృద్ధాప్యంలో మనిషిని జ్ఞాపకాలకు దూరం చేసే ‘అల్జీమర్స్’ వ్యాధికి ఇప్పటివరకూ సరైన చికిత్స అందుబాటులోకి రాలేదు. అయితే కృత్రిమ మేధ (ఏఐ) ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయగలదని, అల్జీమర్స్ అంతానికి బాటలు వేస్తుందని ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాణాంతక వ్యాధికి విరుగుడు కనిపెట్టేందుకు ఏకంగా వంద మిలియన్ డాలర్ల(రూ. 845 కోట్లు) భారీ విరాళాన్ని ప్రకటించి, వైద్యరంగంలో సరికొత్త ఆశలు రేకెత్తించారు.

సరికొత్త ఆవిష్కరణలకు ఏఐ తోడ్పాటు
అల్జీమర్స్ వ్యాధికి కారణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానాలను వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందని ‘టుడే’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆల్ట్‌మాన్ స్పష్టం చేశారు. మెడికల్ హిస్టరీలోని అత్యంత క్లిష్టమైన సమస్యల్లో అల్జీమర్స్ ఒకటని, సంక్లిష్టమైన డేటాను విశ్లేషించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో ఏఐ అద్భుతాలు చేయగలదని ఆయన తెలిపారు. ఈ వ్యాధికి సరైన మందును కనిపెట్టే దిశగా ప్రపంచాన్ని మరింత వేగంగా నడిపించే సత్తా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఉందన్నారు.

ఆరు సంస్థలతో భాగస్వామ్యం
కేవలం మాటలకే పరిమితం కాకుండా, అల్జీమర్స్ పరిశోధనలను ముమ్మరం చేసేందుకు ఓపెన్ఏఐ ఫౌండేషన్ తరపున $100 మిలియన్ల నిధులను ఆల్ట్‌మాన్ కేటాయించారు. ఇందుకోసం ప్రపంచ స్థాయిలోని ఆరు ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నారు. కొత్త డేటాను సృష్టించడం, సరికొత్త ఔషధాలను డిజైన్ చేయడం, అలాగే ఇప్పటికే ఆమోదం పొందిన మందులను ఈ వ్యాధిపై ఎలా ప్రయోగించవచ్చో తెలుసుకోవడం ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. ఈ నిర్ణయం లక్షలాది బాధిత కుటుంబాలకు ఒక గొప్ప ఊరటనిస్తుందని అల్జీమర్స్ అసోసియేషన్ ప్రశంసించింది.

భారత్‌లోనూ తీవ్ర ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా వృద్ధులను పట్టిపీడిస్తున్న డిమెన్షియా కేసుల్లో 60-70 శాతం అల్జీమర్స్ వల్లే నమోదవుతున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ ముప్పు అధికం. ఒక్క భారతదేశంలోనే దాదాపు 8.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, అమెరికాలో 7 మిలియన్ల మంది బాధితులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మెదడులోని కణాలను నాశనం చేస్తూ, ప్రాణాలను బలిగొనే ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు, ఏఐ సాంకేతికతతో జరుగుతున్న ఈ నూతన పరిశోధనలు మానవాళి భవిష్యత్తునే మార్చేయబోతున్నాయని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్‌ యువకునికి నరకం!

Advertisement
 
Advertisement
Advertisement