కిలో ధాన్యం దిగుబడికి 1.15 కిలోల గడ్డి వస్తుంది
టన్ను వ్యర్థాలకు నిప్పుపెడితే 400 కిలోల సేంద్రియ కర్బనం గాలిలో కలుస్తుంది
ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు రైతులు చాలా మంది ఏ పంట పండించినా ఆ పంట కోతలయ్యాక మిగిలే (గడ్డి, కొయ్యకాళ్లు, మోళ్లు, కట్టె వంటి) పంట వ్యర్థాలను అనాలోచితంగా తగులబెడుతున్నారు. దీని వల్ల గాలి కలుషితమై వాతావరణం వేడెక్కటంతో పాటు రైతుకు తరాతరాలుగా అన్నం పెడుతున్న పొలంలోని మట్టి నిర్జీవంగా మారుతోంది. మట్టిలో ఉండి పంటకు, రైతుకు మేలు చేసే సూక్ష్మజీవ రాశులు నశిస్తున్నాయి. రైతులు మరింత ఎక్కువగా రసాయనిక, సేంద్రియ ఎరువులు వెయ్యాల్సి వస్తోంది. పంట పూర్తయ్యాక మిగిలే గడ్డి, కట్టె, మోళ్లలో కూడా చాలా పోషకాలు ఉంటాయి.
అందుకే, వాటిని కాల్చకుండా తిరిగి మట్టికే ఇచ్చేయాలి. మట్టిలో కలియదున్నటమో, గుంతలో వేసి సేంద్రియ ఎరువును తయారు చేసి పంటలకు వేసుకోవటమో నేర్చుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.పొలంలో కేవలం రైతులు వేసే ఎరువులతో మాత్రమే పంట పండదు. కంటికి కనిపించకుండా వేర్ల చుట్టూ పనిచేసే సూక్ష్మజీవరాశి సహాయంతో చాలా పోషకాలను పంట మొక్కలు పొందుతాయి. అంటే, మట్టిలో ఉండే సూక్ష్మజీవులు బాగుంటేనే పొలంలో పంట ఆరోగ్యం బాగుంటుంది. దిగుబడి కూడా బాగా వస్తుంది. అయితే, పంట కోసుకున్న వెంటనే గడ్డీ గాదాన్ని, మోళ్లను, కట్టెను సులువైన పని అనుకొని చాలా మంది రైతులు తగులబెడుతున్నారు. ఆ వేడికి మట్టిలో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఆ తర్వాత అక్కడ సాగు చేసే పంటకు అంతకు ముందు కన్నా ఎక్కువ ఎరువు వెయ్యాల్సి వస్తుంది.
పంటకు సూక్ష్మజీవులు చేసే మేలేంటి?
ఒక మొక్క లేదా చెట్టు తాను సమకూర్చుకునే పోషకాలను ఏయే విధంగా ఉపయోగిస్తుందో తెలుసా? భూమి పైన పెరిగే కాండం, ఆకులు, కంకులు/ ధాన్యం/ పూలు/కాయల కోసం 40% పోషకాలను ఖర్చు చేస్తుంది. భూమి లోపల పెరిగే వేర్ల కోసం 30% పోషకాలను కేటాయిస్తుంది. మిగతా 30% పోషకాలను తన వేర్లకు చుట్టూ ఉండే మట్టిలోని కోటానుకోట్ల సూక్ష్మజీవరాశి పెరుగుదల కోసం పోషక ద్రవాల (రూట్ ఎక్సుడేట్స్) రూపంలో స్రవిస్తుంది. ఈ పోషక ద్రవాలతో పెరిగే సూక్ష్మజీవులు అందుకు కృతజ్ఞతగా వేర్లకు ఎలా సాయం చేస్తాయో తెలుసా? మట్టిలో నిగూఢంగా ఉన్న అనేక సూక్ష్మ పోషకాలను కరిగించి లేదా రూపం మార్చి వేర్లకు అందిస్తాయి.
ఇంకా వివరంగా చెప్పాలంటే.. పంటలు లేదా మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలంటే కనీసం 16 రకాల పోషకాలు అవసరం. ఇందులో మూడింటిని వాతావరణం నుంచి తీసుకుంటాయి. 13 పోషకాల్లో కొన్నిటిని మనం రసాయనిక/ సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తున్నాం. మిగతా వాటిని మట్టిలోని సూక్ష్మజీవులు, వానపాములు మాత్రమే అందించగలవు. అంటే.. పంట మొక్కల వేర్లు, మట్టిలోని సూక్ష్మజీవులు పరస్పరం ఆధారపడి జీవిస్తాయన్న మాట. మనం ఇది తెలుసుకోలేక పొలంలోనే కొయ్యకాళ్లు, మోళ్లు వంటి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టినప్పుడు ప్రకృతిలోని ఈ సమతుల్యతను మనమే చేజేతులా పాడు చేసుకుంటున్నా మని రైతులు గుర్తించాలి.
ధాన్యం కన్నా గడ్డి బరువు ఎక్కువ
‘వరి పంట ద్వారా కిలో ధాన్యం దిగుబడి వస్తుంటే కిలో కన్నా 15 గ్రాముల బరువైన గడ్డి (ధాన్యం–గడ్డి నిష్పత్తి 1:1.5) మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ గడ్డిలో ఉండే పోషకాలను కాల్చి వృథా చెయ్యకుండా తిరిగి ఆ మట్టిలోనే కలియదున్ని కుళ్లింపజెయ్యటమో లేదా గుంతలో వేసి కుళ్లించి సేంద్రియ ఎరువుగా మార్చి పంటలకు వెయ్యటమో చెయ్యటం ద్వారా ఎరువుల ఖర్చు తగ్గుతుంది. పంటలకూ మేలు జరుగుతుంద’ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మట్టి శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మేకల శంకర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో 50 కోట్ల టన్నుల పంట వ్యర్థాలు వస్తున్నాయి. వివిధ అవసరాలకు వాడుకోగా 10 కోట్ల టన్నుల గడ్డి, కట్టె మిగులుతోంది. ఇతర ఇబ్బందులతో పాటు అవగాహన లేమితో రైతులు 2.5 కోట్ల టన్నుల వ్యర్థాలను తగులబెడుతున్నారు. వరి గడ్డి, కొయ్యకాళ్లు, పత్తి కట్టె, మొక్కజొన్న చొప్ప, కంది కట్టె వంటి వాటిని కాల్చేస్తున్నారు. వెయ్యబోయే రెండో పంటకు ఎక్కువ రోజుల వ్యవధి లేదనో, కూలీలు దొరకలేదనో, ఖర్చు పెట్టలేకనో నిప్పుపెడుతున్నారు.
మనది ఉష్ణమండల ప్రాంతం కావటంతో భూమిలో సేంద్రియ కర్బనం అతి తక్కువగా 0.01 నుంచి 0.3% వరకు మాత్రమే ఉంది. రైతుల దగ్గర ఆవులు, ఎద్దులు, పాడి పశువులు తగ్గిపోవటంతో పశువుల ఎరువు వెయ్యటం లేదు. పైగా కొయ్యకాళ్లు, తదితర వ్యర్థాలను తగులబెట్టటం చాలా అనర్థాలకు దారితీస్తోంది. పొలంలో ఒక టన్ను పంట వ్యర్థాలను తగులబెడితే ఆ వేడికి మట్టిలోని 400 కిలోల సేంద్రియ కర్బనం, 20 కిలోల నత్రజని, భాస్వరం 12–13 కిలోలు, పొటాషియం 30–35% వరకు గాలిలో కలిసి పోతుంది. ఈ విధంగా మట్టిలో జీవవైవిధ్యం తగ్గిపోవటంతో ఆ పొలంలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతున్నది. వ్యర్థాలను మట్టిలో కలియదున్ని, డీకంపోజర్ చల్లితే కుళ్లి నేల సారవంతం అవుతుంది. లేదంటే గుంత తవ్వి గడ్డీ గాదాన్ని అందులో వేసి, పేడ నీళ్లు, సింగిల్ ఫాస్పేట్ వేసి మట్టితో కప్పి పెడితే 3 నెలల్లో మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఎంత చెప్పినా రైతుల్లో మార్పు రావట్లేదు. భూమిని ముందు తరాలకు అందించాలన్న తపన ఉన్న రైతులైనా కదలాలి. ఏదైనా చెయ్యండి, పంట వ్యర్థాలకు నిప్పు మాత్రం పెట్టొద్దు.
– డాక్టర్ మేకల శంకర్, ప్రధాన శాస్త్రవేత్త,
మట్టి శాస్త్ర విభాగం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం
నిర్వహణ: పంతంగి రాంబాబు


