‘డిజిటల్‌’ కేసులో పరిహారం! | Compensation in the digital case | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌’ కేసులో పరిహారం!

Apr 25 2026 2:52 AM | Updated on Apr 25 2026 2:52 AM

Compensation in the digital case

జేబులు కొట్టడం, దారి దోపిడీలు చేయడం, దొంగతనాలకు పాల్పడటం, నమ్మించి మోసగించటం... ఇవన్నీ పాతకాలపు నాటు పద్ధతులు. 2016లో పెద్దనోట్ల రద్దుతర్వాత దేశంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు మొదలై వీటన్నిటినీ మరపించేలా కొత్త కొత్తదోపిడీ విధానాలు రంగప్రవేశం చేస్తున్నాయి. అందులో తాజాగా వచ్చిచేరిన ‘డిజిటల్‌ అరెస్టు’ వీటన్నిటినీ తలదన్నింది. ఈ మార్గాల్లో పౌరులు కోల్పోతున్న సొమ్ము వందల్లోంచి వేలల్లోకి... అక్కడి నుంచి లక్షలు దాటి ఇప్పుడు కోట్లాది రూపాయలకుచేరటంతో మన వ్యవస్థల్లో చలనం వచ్చినట్టుంది. 

అందుకే కావొచ్చు... ఇటీవల రిజర్వ్‌ బ్యాంకు స్వతంత్ర ప్రతినిధి (ఆంబుడ్స్‌మన్‌) ఈ తరహాలో రూ. 22.93 కోట్లు పోగొట్టుకున్న నరేష్‌చంద్ర అనే బాధితుడికి కోటీ  31 లక్షల పరిహారం చెల్లించాలని అయిదు బ్యాంకుల్ని ఆదేశించింది. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో లక్షలాది రూపాయలు నష్టపోతున్న బాధితులు తమ మూర్ఖత్వాన్నీ, తెలివితక్కువతనాన్నీ తిట్టుకుని రోదిస్తు న్నారు. 

‘డిజిటల్‌ అరెస్టు’లో రూ. 8 కోట్లు కోల్పోయిన ఉదంతంలో పంజాబ్‌ మాజీ ఐజీ అమర్‌సింగ్‌ చాహల్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. ఫిర్యాదులిచ్చినా తిరిగి రాబట్టుకునే సొమ్ము అంతంతమాత్రంగానే ఉంటున్నది. సైబర్‌ క్రైమ్‌ విభాగాలకు ఫిర్యాదు చేయ టానికి వెళ్తే ‘ఆ మాత్రం తెలియదా?’ అంటూ ఎదురయ్యే చీవాట్లను భరించటంఅదనపు కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంబుడ్స్‌మన్‌ నిర్ణయం బాధితులకు ఉపశమనంకలిగిస్తుంది. 

ఈ మోసాలు పౌరులకు పెద్ద తలనొప్పిగా మారాయి. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే ‘మన్‌ కీ బాత్‌’లో ‘డిజిటల్‌ అరెస్టు’ మోసాల గురించి ప్రస్తావించాక, మీడియాలో రిజర్వ్‌ బ్యాంకు తరఫున భారీ ప్రకటనలివ్వటం మొదలైనాక జనంలో ఏదోమేరకు చైతన్యం వచ్చిన సంగతి వాస్తవమే. అయితే ఇంకా మోసపోయేవారిసంఖ్య తగ్గటం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మోసాల కారణంగా జనం రూ. 34,771 కోట్లు కోల్పోయారని రిజర్వ్‌ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. 

ఇందులో కేవలం ‘డిజిటల్‌ అరెస్టు’ల వాటాయే రూ. 1,900 కోట్లు ఉంది. 2022లో 10.29లక్షలున్న కేసులు 2024 నాటికి 22.68 లక్షలకు చేరాయి. గత మూడేళ్లలో జనం నుంచి మాయగాళ్లు కొట్టేసిన సొమ్ము 1.25 లక్షల కోట్లు! సిబ్బంది కొరత మాటెలావున్నా, పోలీసు విభాగాల్లో సైబర్‌ నేరాల దర్యాప్తు, ఆచూకీ రాబట్టడం వగైరాల్లో చాలామందికి పకడ్బందీ శిక్షణ లేదు. ఈ మాదిరి నేరాలకు పాల్పడేవారు వేరే రాష్ట్రాలకూ, వేరే దేశాలకూచెందినవారు కావటం, దర్యాప్తు చేయటానికి పెద్ద ఆటంకంగా మారింది.

నియంత్రణ వ్యవస్థలు ఈ మోసాలను అరికట్టడానికి కొత్త ఉపకరణాలు కనుక్కొనే లోగానే నేరగాళ్లు ఏఐతో, ఇతరేతర మార్గాల్లో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ చట్టం, 2023 నాటి డేటా పరిరక్షణ చట్టం వంటివి మధ్యస్తంగా ఉండే సంస్థలపై బాధ్యత మోపాయి. కానీ ఆచరణలో పెద్దగా ప్రయోజనం లేదు.

ఆంబుడ్స్‌మన్‌ నిర్ణయం ఈ నేరాలను అరికట్టడంలో ముందడుగు. అసలు ఖాతాదార్లకు తెలియకుండా దొంగసొమ్ము రాకపోకలకు నేరగాళ్లు వాడుకునే ‘మ్యూల్‌ అకౌంట్‌ల’ పనిబట్టేందుకు ఇటీవల ప్రయత్నాలు మొదలయ్యాయి. బ్యాంకుల నిష్క్రియాపరత్వం కావొచ్చు... సిబ్బంది కుమ్మక్కుకావటం వల్ల కావొచ్చు ఇవిఇన్నాళ్లూ నిర్నిరోధంగా సాగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో నేరగాళ్లకు సహకరించేబ్యాంకు సిబ్బందిని పోలీసులు ఈమధ్యే అరెస్టు చేశారు. ఈ మార్గంలోనే ఆంబుడ్స్‌మన్‌ సైతం ఖాతాదారు వివరాలు సేకరించటానికి, ద్రవ్య అక్రమ చలామణిని అరికట్టడానికి ఉన్న నిబంధనల్ని పాటించటంలో అలసత్వం ప్రదర్శించినందుకు నరేష్‌చంద్ర కేసులో పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 

అయితే దీంతో ఆయన సంతృప్తిపడదల్చుకోలేదు. రిజర్వ్‌బ్యాంకు మార్గదర్శకాలు పాటించని ఆ బ్యాంకులనుంచి తాను కోల్పోయిన మొత్తం రూ. 22.93 కోట్లు ఇవ్వటంతోపాటు నష్టపరిహారం, వడ్డీ, క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్నుకయ్యే ఖర్చుతో సహా వెనక్కి ఇప్పించాలని నరేష్‌చంద్ర పోరాడతానంటున్నారు. ఆన్‌లైన్‌ మోసాల్లో బాధితులుగా మారుతున్నవారు పోలీసు కేసులు పెట్టడంతోపాటు, బ్యాంకుల అలసత్వం ఉన్నపక్షంలో వాటిపై కూడా న్యాయపోరాటం చేయటానికినరేష్‌చంద్ర కేసు స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement