యువతిపై లైంగిక వేధింపులు రెబ్బెన ఎస్సైపై వేటు

Telangana Rebbena SI Cop Accused Of Sexual Harassment - Sakshi

భర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఎస్సై భార్య ఆత్మహత్యాయత్నం

ఆసిఫాబాద్‌/రెబ్బెన: యువతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెబ్బెన ఎస్సైపై వేటు పడింది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ సీఐ, మరో ఎస్సై మహిళలపై లైంగికదాడుల ఘటనలు మరువక ముందే కుమురంభీం జిల్లా రెబ్బెన ఎస్సైపైనా ఆరోపణలొచ్చాయి. బాధితురాలి కథనం ప్రకారం రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఓ యువతి పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది.

పరీక్షకు సిద్ధమవుతోంది. స్టడీ మెటీరియల్‌ ఇప్పిస్తానని, పరీక్ష లేకుండానే పాస్‌ చేయిస్తానని రెబ్బెన ఎస్సై భవానీసేన్‌ నెల క్రితం యువతికి ఫోన్‌ చేసి స్టేషన్‌కు పిలిపించుకున్నాడు. ఎత్తు కొలుస్తానంటూ స్టేషన్‌లోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. పలుమార్లు ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం సోమవారం బయటకు పొక్కింది.

యువతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సైపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఆమెను విచారించారు. ఆపై ఎస్సైని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు. కాగా, యువతి డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ... స్టేషన్ల చుట్టూ తిరగడం ఇబ్బందవుతుందని ఇంట్లోవారు చెప్పడంతో కేసు విత్‌డ్రా చేసుకుంటున్నానని తెలిపింది.

మరోవైపు ఎస్సై వ్యవహారం టీవీ చానళ్లతోపాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవడంతో అవమానంగా భావించిన ఎస్సై భార్య మంగళవారం రెబ్బెనలోని ఎస్సై క్వార్టర్‌లో శానిటైజర్‌ తాగి, ఆత్మహత్యకు యత్నించింది. ఇరుగుపొరుగు వారు ఆమెను రెబ్బెన పీహెచ్‌సీకి అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top