నా చావుకు మల్లికార్జున్‌ సార్‌ కారణం.. ‘కాల్మొక్తా.. కాపాడన్నా’

Man Sets Self On Fire Due To Manager Harasements At Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి: ‘కాల్మొక్తా కాపాడన్నా’.. అంటూ ఓ యువకుడు మంటల్లో కాలిపోతూ వేడుకున్నాడు. తను పనిచేసే పరిశ్రమ యాజమాన్యంతోపాటు మేనేజర్‌ మోసం చేశారని ఆరోపించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం లచ్చంపేట గ్రామానికి చెందిన కమ్మరిపేట లక్ష్మి, నర్సింలుకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు తిరుమలేశ్‌ (27) ఐదేళ్లుగా వనంపల్లి శివారులోని జీబీ బేకర్స్‌ పరిశ్రమలో మిషన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

గత జూలైలో పరిశ్రమలో పనిచేస్తుండగా చేయి ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి గాయాలపాలయ్యాడు. పరిహారం ఇవ్వడంతోపాటు ఉద్యో గం పర్మినెంట్‌ చేస్తామని పరిశ్రమ యాజమాన్యం, మేనేజర్‌ మల్లికార్జున్‌ హామీ ఇచ్చారు. ఈ విషయమై తిరుమలేశ్‌ కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. యాజమాన్యంతో మాట్లాడతానంటూ మల్లికార్జున్‌ మభ్యపెడుతూ వచ్చాడు.

శనివారం మరోసారి గుర్తు చేయగా ‘పరిహారం లేదు, ఏమీ లేదు.. నీ చావు నీవు చావు’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పరిశ్రమలో పనిచేసేందుకు యథావిధిగా తిరుమలేశ్‌ వెళ్లగా లోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురై తుమ్మలపల్లి శివారు కంకల్‌ దారిలోని ఎల్లమ్మ దేవాలయం దగ్గరలో ఒంటి పై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 

నా చావుకు మల్లికార్జున్‌ సార్‌ కారణం.. 
లాల్‌పహాడ్‌ వైపు నుంచి యెన్కెపల్లి వైపు ట్రాక్టర్‌ డోజర్‌తో వెళ్తున్న లచ్చంపేట గ్రామానికి చెందిన వడ్డెగారి శ్రీనివాస్‌ మంటల్లో కాలిపోతున్న తిరుమలేశ్‌ను చూశాడు. ఏమైంది.. ఎందుకిలా చేశావు అనగా ‘కాల్మొక్తా అన్నా.. నన్ను కాపాడు’ అంటూ అరిచాడు. వెంటనే స్థానికుల సాయంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన చావుకు మల్లికార్జున్‌ సార్‌ కారణం అంటూ తిరుమలేశ్‌ ఆత్మహత్యాయత్నానికి ముందు తన మొబైల్‌లో స్టేటస్‌ పెట్టుకున్నాడు.

అది చూసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు తిరుమలేశ్‌ను వెతుకుతున్న క్రమంలోనే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలిసింది. మల్లికార్జున్‌తోపాటు లేబర్‌ కాంట్రాక్టర్‌ వెంకట్‌రెడ్డి, అసిస్టెంట్‌ బాలకృష్ణ వేధింపులే కారణమని బాధితుడి సోదరుడు కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సక్రమ్, షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ సత్యనారాయణ ఉస్మానియాలో చికిత్స పొందుతున్న తిరుమలేశ్‌ స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమ యాజమాన్యంతోపాటు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.
చదవండి: అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top