పలమనేరు: మండలంలోని లెప్రసీ ఆస్పత్రి వద్ద బుధవారం ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన కారు ఢీకొని బస్సు కిందకు దూసుకెళ్లింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం హొసూరుకు చెందిన ముంజునాథ, శరత్, ఆనంద్‌రాజ్, మంజు మెడికేరకు చెందిన కారును అద్దెకు తీసుకుని ఎక్స్‌ప్రైస్ హైవే మీదుగా తిరుమల బయలుదేరారు. ఎమ్మాస్విస్ ఆస్పత్రి వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక వైపు ఢీకొన్నారు. కారు బస్సు కిందకు దూసుకెళ్లింది. దీంతో కారులోని నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. వారు పూటుగా మద్యం సేవించినట్టు తెలిసింది. వారు మద్యం మత్తులో వీకోట వద్ద మరో బస్సును ఢీకొనేందుకు ప్రయత్నం చేసినట్టు తెలిసింది. బస్సు డ్రైవర్ కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మోహన్‌రెడ్డి అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆంబులెన్స్ ద్వారా పలమనేరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని వైద్యులు పెద్దాసుపత్రికి రెఫర్‌చేశారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.


