దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన అమ్మకాలతో దేశంలోనే మూడో అతిపెద్ద కార్ల తయారీదారుగా (మారుతీ సుజుకీ, మహీంద్రా తర్వాత) నిలిచిన టాటా మోటార్స్ అదే జోరును కొనసాగించేందుకు ఏప్రిల్ నెలలో ఆఫర్లను ప్రకటించింది. తన పాపులర్ ఐసీఈ (పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ) మోడళ్లపై ఏకంగా రూ.55,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.
హ్యుందాయ్‌ను దాటేసిన టాటా!
గత ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) విభాగం ఊహించని వృద్ధిని సాధించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 5,53,585 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు 2026 నాటికి 14.05% వృద్ధిని నమోదు చేస్తూ 6,31,387 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఘనతతో హ్యుందాయ్ మోటార్ ఇండియాను వెనక్కి నెట్టి టాటా మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు?
వినియోగదారుల డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ డిస్కౌంట్ రూపంలో ఈ రాయితీలు లభిస్తాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
| మోడల్ | గరిష్ఠ డిస్కౌంట్ |
|---|---|
| టాటా కర్వ్ (Curvv) | రూ. 55,000 |
| టాటా హారియర్ (Harrier) | రూ. 45,000 |
| టాటా సఫారీ (Safari) | రూ. 45,000 |
| టాటా ఆల్ట్రోజ్ (Altroz) | రూ. 35,000 |
| టాటా నెక్సాన్ (Nexon) | రూ. 30,000 |
| టాటా టియాగో (Tiago) | రూ. 30,000 |
| టాటా టిగోర్ (Tigor) | రూ. 30,000 |
పోటీ మార్కెట్‌లో హోరాహోరీ
వేసవి సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రధాన కంపెనీలన్నీ పోటీ పడుతున్నాయి. మారుతీ సుజుకీ తన కార్లపై గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించగా, హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.60,000 వరకు తగ్గింపు ఇస్తోంది. వాటితో పోలిస్తే టాటా ఆఫర్లు తక్కువగా అనిపించినప్పటికీ సేఫ్టీ రేటింగ్స్, సరికొత్త డిజైన్ల కారణంగా టాటా కార్లకు డిమాండ్ భారీగా ఉందని కంపెనీ అధికారలు చెబుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న డిస్కౌంట్లు సీటీ, డీలర్‌షిప్, స్టాక్ లభ్యతను బట్టి మారుతుంటాయి. కచ్చితమైన ధర, ఆఫర్ల కోసం మీ సమీపంలోని అధికారిక షోరూమ్‌ను సంప్రదించగలరు.
ఇదీ చదవండి: లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!


