దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న సానుకూల ధోరణికి బ్రేక్ వేస్తూ బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నేటి ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 756 పాయింట్లు పతనమై 78,516 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 24,378 వద్ద ముగిసింది.
విశ్లేషకుల అంచనా ప్రకారం పతనానికి కారణాలు
ముదురుతున్న అనిశ్చితి
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ ప్రతిచర్యల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూతపడటం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. తాజా దాడుల వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన నింపడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు.
చమురు ధరల సెగ - ద్రవ్యోల్బణ ముప్పు
యుద్ధం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును దాటడం భారత్ వంటి దిగుమతి దేశాలకు పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తాజా గణాంకాల ప్రకారం, మార్చి నెలలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా 3.3% కి పెరగడం, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటం మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.
వడ్డీ రేట్ల తగ్గింపుపై సందేహాలు
ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న ఆశలు ఆవిరయ్యాయి. ‘వడ్డీ రేట్లు తగ్గకపోగా, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బ్యాంకులు మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది’ అనే వార్తలు టెక్నాలజీ, బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలకు దారితీశాయి.
ఇప్పుడేం చేయాలి?
ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ తీవ్రమైన ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ పరిణామాలు, ముడిచమురు ధరల కదలికలను బట్టి రానున్న రోజుల్లో మార్కెట్ దిశ నిర్దేశించబడుతుంది. చిన్న ఇన్వెస్టర్లు తొందరపడి అమ్మకాలు జరపకుండా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించడం ఉత్తమం.
ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!


