‘ఆ కంపెనీని రక్షించండి.. ఈ ప్రశ్నలకు మీ సమాధానం’ | Sakshi
Sakshi News home page

‘ఆ కంపెనీని రక్షించండి.. ఈ ప్రశ్నలకు మీ సమాధానం’

Published Tue, Nov 28 2023 6:53 PM

Raymonds Independent Directors Must Protect Company - Sakshi

రేమండ్‌ కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న సింఘానియా కుటుంబంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీ ఎండీగా ఉన్న గౌతమ్‌ సింఘానియా తన భార్య నవాజ్‌మోదీతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే అందుకు కంపెనీలో 75 శాతం వాటాను ఆమె డిమాండ్‌ చేశారు. దానిపై తాను కోర్టును ఆశ్రయించేందుకు న్యాయసలహాదారులను కూడా నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. గౌతమ్‌ సింఘానియా మాత్రం ఆయన మరణం తర్వాత తన ఆస్తిని ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దానికి చేరేలా చూడాలని కోరినట్లు సమాచారం. 

ఈ మొత్తం వ్యవహారంతో కంపెనీ డైరెక్టర్లలో స్పష్టత లోపిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ బిజినెస్‌ మోడల్‌పై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపబోతుందోనని ఆందోళనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌(ఇయాస్‌) రేమండ్ కంపెనీని దాని ప్రమోటర్ల నుంచి రక్షించాలని స్వతంత్ర డైరెక్టర్లను  కోరింది. సింఘానియా, నవాజ్‌మోదీ ఆరోపణలపై విచారణ జరిపించాలని తెలిపింది. విచారణ సమయంలో గౌతమ్, నవాజ్‌లను బోర్డు నుంచి దూరంగా ఉంచాలని సూచించింది.

నవంబర్ 13న నవాజ్ మోదీ నుంచి గౌతమ్ సింఘానియా విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దాని తర్వాత ఆమె కంపెనీ నికర విలువ దాదాపు రూ.12వేల కోట్లలో 75 శాతం వాటా కావాలని కోరింది. గౌతమ్ సింఘానియా తనపై దాడి చేశారని ఆరోపించింది. కంపెనీ సృష్టికర్త, గౌతమ్ సింఘానియా తండ్రి విజయపత్ సింఘానియా తన కోడలికే తను మద్దతు ఇస్తానని ఓ మీడియా వేదికగా చెప్పారు. 

ఇదీ చదవండి: ఇషా అంబానీకి చెందిన ఆ కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు!

గౌతమ్‌, నవాజ్‌ ఇద్దరు బోర్డు సభ్యులు ఇంత తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ స్వతంత్ర డైరెక్టర్లు మౌనంగా ఉండడాన్ని ఇయాస్‌ తప్పబట్టింది. ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని, గత కొన్ని రోజులుగా స్టాక్ ధర భారీగా తగ్గిపోతుందని తెలిపింది. వీలైనంత త్వరగా ఈ విషయంపై స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

ఇయాస్‌ స్వతంత్ర డైరెక్టర్లకు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది.

1. డైరెక్టర్లలో ఎవరైనా కంపెనీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

2. కంపెనీ లేదా డైరెక్టర్లపై నేరారోపణలు ఉంటే ఏం చేస్తారు?

3. డైరెక్టర్ల చర్యలు కంపెనీ బ్రాండ్‌కు నష్టం కలిగిస్తున్నట్లయితే ఎలా స్పందిస్తారు? 

4. సీఈఓ కొన్ని చర్యల ద్వారా అరెస్ట్‌ అయితే కంపెనీపై దాని ప్రభావం ఎలా ఉంటుంది?

5. గౌతమ్‌, నవాజ్‌ త్వరలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోబోతుండగా కంపెనీ కార్యాకలాపాల కోసం తాత్కాలిక సీఈఓను నియమించకూడదా?

ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే?

ఈ ప్రశ్నల ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్లు కంపెనీ వాటాదారుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవాలని ఇయాస్‌ పేర్కొంది. ఎలాంటి పరిస్థితులనైనా నిష్పక్షపాతంగా ఎదుర్కొనేందుకు బోర్డు సభ్యలు సిద్ధంగా ఉండాలని సూచించింది.

Advertisement
Advertisement