దివాలా పరిష్కారాలు అంతంతే | Sakshi
Sakshi News home page

దివాలా పరిష్కారాలు అంతంతే

Published Wed, Mar 29 2023 3:31 AM

Only 15percent Insolvency Cases Reach Resolution During October-December 2022 - Sakshi

ముంబై: కంపెనీ చట్ట ట్రిబ్యునళ్లలో దాఖలైన దివాలా కేసులు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికం(క్యూ3)లో అంతంతమాత్రంగానే పరిష్కారమయ్యాయి. వెరసి క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో దివాలా పరిష్కారాలు(రిజల్యూషన్లు) 15 శాతంగా నమోదయ్యాయి. ఇన్‌సాల్వెన్సీ, దివాలా బోర్డు(ఐబీబీఐ) గణాంకాల ప్రకారం 267 దివాలా కేసులలో 15 శాతమే రిజల్యూషన్ల స్థాయికి చేరాయి. ఇక క్లెయిమ్‌ చేసిన రుణాలలో 27 శాతమే రికవరీ అయినట్లు గణాంకాలు వెల్లడించాయి.

45 శాతం కేసులు లిక్విడేషన్‌ ద్వారా ముగిసినట్లు ఐబీబీఐ గణాంకాలను విశ్లేషించిన కొటక్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. త్రైమాసికవారీగా చూస్తే ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్‌)లో కేసులు 256కు దిగివచ్చాయి. 2019–20లో నమోదైన 2,000 కేసుల రన్‌రేట్‌తో పోలిస్తే భారీగా తగ్గాయి. కాగా.. ఎలాంటి రిజల్యూషన్‌ ప్రణాళికలు లభించకపోవడంతో లిక్విడేషన్‌లలో మూడో వంతు కేసులు ముగిసినట్లు కొటక్‌ విశ్లేషణ వెల్లడించింది. మొత్తం 1,901 కేసులు పరిష్కారంకాగా.. 1,229 కేసులు లిక్విడేషన్‌కే బ్యాంకర్లు ఓటేశారు.

మరో 600 కేసులలో ఎలాంటి పరిష్కార ప్రణాళికలూ దాఖలు కాలేదు. 56 కేసుల విషయంలో నిబంధలకు అనుగుణంగాలేక తిరస్కరణకు గురికాగా.. 16 కేసుల్లో పరిష్కార ప్రొవిజన్లకు రుణదాతలు అనుమతించలేదు. ఇక లిక్విడేషన్‌ కేసులలో 76 శాతం కంపెనీ మూతపడటం లేదా ఆర్థిక పునర్వ్యవస్థీకరణ(బీఐఎఫ్‌ఆర్‌) వల్ల నమోదుకాగా.. మిగిలినవి ఇతర కారణాలతో జరిగినట్లు కొటక్‌ వివరించింది. కేసుల పరిష్కారం ఆలస్యమవుతున్నప్పటికీ 2021 క్యూ2 (కరోనా మహమ్మారి   కాలం)తో పోలిస్తే తగ్గినట్లే.   

270 రోజులకుపైగా
ఈ ఏడాది క్యూ3లో దాఖలైన కేసులలో 64% 270 రోజులను దాటేశాయి. మరో 14% కేసులు నమోదై 180 రోజులైంది. వెరసి లిక్విడేషన్‌ కేసులు అధికమయ్యే వీలున్నట్లు కొటక్‌ విశ్లేషించింది. రుణ పరిష్కార సగటు 590 రోజులుగా తెలియజేసింది. కొత్త కేసుల విషయంలో 50 శాతంవరకూ నిర్వాహక రుణదాతలు చేపడుతుంటే, 40 శాతం ఫైనాన్షియల్‌ క్రెడిటర్లకు చేరడం క్యూ3లో కనిపిస్తున్న కొత్త ట్రెండుగా తెలియజేసింది.

తాజా త్రైమాసికంలో దాఖౖ లెన కేసులలో 42 శాతం తయారీ రంగం నుంచికాగా, 18 శాతం రియల్టీ, 13 శాతం రిటైల్, హోల్‌సేల్‌ వాణిజ్యం, 7 శాతం నిర్మాణం నుంచి నమోదయ్యాయి. ఐబీసీ ప్రాసెస్‌ తొలి నాళ్లలో భారీ కార్పొరేట్‌ కేసులు అధికంగా నమోదుకాగా.. ప్రస్తుతం దేశీ కార్పొరేట్‌ పరిస్థితులు పటిష్ట స్థితికి చేరుతు న్నట్లు విశ్లేషణ పేర్కొంది. కొత్త కేసులలో కరోనా మహమ్మారి ప్రభావంపడిన మధ్య, చిన్నతరహా సంస్థల నుంచి నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఐబీసీ ద్వారా మొత్తం రుణ పరిష్కార విలువ రూ. 8.3 లక్షల కోట్లకు చేరగా.. ఫైనాన్షియల్‌ క్రెడిటర్లు 73 శాతం హెయిర్‌కట్‌ను ఆమోదించాయి.

Advertisement
Advertisement