గోల్డ్‌ ఈటీఎఫ్‌లు మెరిశాయ్‌ | Gold ETFs record Rs 31561 crore inflows in Q4 FY26 | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ ఈటీఎఫ్‌లు మెరిశాయ్‌

Apr 15 2026 1:19 AM | Updated on Apr 15 2026 8:00 AM

Gold ETFs record Rs 31561 crore inflows in Q4 FY26

మార్చి క్వార్టర్‌లో రూ.31,561 కోట్ల పెట్టుబడులు 

డిసెంబర్‌ కంటే 36 శాతం అధికం 

మార్చి నెలలో బలహీన ధోరణి

న్యూఢిల్లీ: బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు)కు మార్చి త్రైమాసికంలో ఇన్వెస్టర్ల నుంచి బలమైన ఆదరణ కనిపించింది. రూ.31,561 కోట్ల తాజా పెట్టుబడులను ఇవి ఆకర్షించాయి. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులతో పోల్చితే ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం. అంతేకాదు 2025–26 డిసెంబర్‌ త్రైమాసికంలో వచ్చిన రూ.23,132 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూసినా 36 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసిన డేటా ప్రకారం.. మార్చి నెలలో మాత్రం పెట్టుబడుల రాక బలహీనపడింది.

మార్చి నెలలో కేవలం రూ.2,266 కోట్ల పెట్టుబడులు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో రూ.24,040 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,255 కోట్లతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. బంగారం ధరలు గత రెండేళ్లలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం తెలిసిందే. ఫలితంగా ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌లవైపు మొగ్గు చూపడం పెరిగింది. దీంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వీటిల్లోకి వచ్చాయి. ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు అమ్మకాల ఒత్తిడికి కొంత తగ్గిన నేపథ్యంలో, ఈటీఎఫ్‌ పెట్టుబడులపై ఇది ప్రభావం చూపించనట్టు తెలుస్తోంది.  

రూ.1.71 లక్షల కోట్ల ఆస్తులు 
గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) మార్చి చివరికి రూ.1.71 లక్షల కోట్లకు చేరాయి. 2025 మార్చి చివరికి వీటి విలువ రూ.58,888 కోట్లతో పోల్చితే మూడు రెట్లు పెరిగాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ఫోలియోలు (ఒక ఈటీఎఫ్‌లో ఒక ఇన్వెస్టర్‌ పెట్టుబడికి గుర్తింపు సంఖ్య) గత ఆర్థిక సంవత్సరంలో 54.28 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ఫోలియోలు 1.24 కోట్లకు చేరాయి. ‘‘జనవరిలో పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్‌ (మార్పులు, చేర్పులు), రిస్క్‌ తీసుకునే ధోరణి ఫలితంగా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు అధికంగా వచ్చాయి.

దీంతో తర్వాతి నెలల్లో పెట్టుబడులు బలహీనంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మార్చి నెలలో సానుకూల పెట్టుబడులు నమోదవడం అన్నది మార్కెట్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో బంగారాన్ని వైవిధ్యమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారనేదానికి సంకేతం’’అని మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ నేహల్‌ మెష్రామ్‌ పేర్కొన్నారు. బంగారంతో పోల్చితే ఈక్విటీల వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా మారినందున మార్చి నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు తగ్గడానికి కారణమని ద వెల్త్‌ కంపెనీ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో (డెట్‌) ఉమేష్‌ శర్మ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement