డిస్నీలో లేఆఫ్స్? | Disney Plans 1000 Job Cuts New CMO Reshapes Marketing Under Project Imagine | Sakshi
Sakshi News home page

డిస్నీలో లేఆఫ్స్?

Apr 9 2026 10:17 AM | Updated on Apr 9 2026 10:25 AM

Disney Plans 1000 Job Cuts New CMO Reshapes Marketing Under Project Imagine

1,000 మంది ఉద్యోగులపై వేటు

ప్రపంచ వినోద రంగ దిగ్గజం ‘వాల్ట్ డిస్నీ’ తన ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది వారాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ప్రధానంగా కంపెనీలోని మార్కెటింగ్ విభాగంపై ఈ ప్రభావం అధికంగా ఉండనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

మార్కెటింగ్ విభాగమే లక్ష్యంగా..

డిస్నీలో జరుగుతున్న ఈ తాజా పరిణామాలు సంస్థ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణలో భాగమని తెలుస్తోంది. కొత్తగా నియమితులైన చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ) అసద్ అయాజ్ కంపెనీ మార్కెటింగ్ గ్రూపును ఏకీకృతం చేసే పనిలో ఉన్నారు. ‘ప్రాజెక్ట్ ఇమాజిన్’ అనే రహస్య కోడ్ పేరుతో వ్యయ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జనవరిలో బాధ్యతలు చేపట్టిన అయాజ్ సంస్థలోని అన్ని మార్కెటింగ్ కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు.

కొత్త చేపట్టబోయే లేఆఫ్స్‌ డిస్నీ మొత్తం శ్రామిక శక్తిలో 1 శాతం కంటే తక్కువే. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి డిస్నీలో సుమారు 2,31,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జోష్ డి అమారో డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించక ముందే ఈ ఉద్యోగాల తగ్గింపు ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం.

స్పందించని డిస్నీ యాజమాన్యం

ఈ వార్తలపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టత కోరగా, డిస్నీ యాజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆఫీస్‌ పనివేళలు ముగిసిన తర్వాత ఈ నివేదిక బయటకు రావడంతో కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి అందుబాటులోకి రాలేదు.

ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement