అమెరికా–ఇరాన్‌ డీల్‌పై ఆశలతో... | Crude oil prices fall amid hopes for US-Iran peace talks | Sakshi
Sakshi News home page

అమెరికా–ఇరాన్‌ డీల్‌పై ఆశలతో...

Apr 22 2026 2:32 AM | Updated on Apr 22 2026 2:32 AM

Crude oil prices fall amid hopes for US-Iran peace talks

ఒక శాతం పెరిగిన స్టాక్‌ సూచీలు 

కలిసొచ్చిన క్రూడ్‌ ధరల తగ్గుదల 

రూ. 3 లక్షల కోట్ల సంపద సృష్టి

ముంబై: అమెరికా–ఇరాన్‌ల మధ్య శాంతి చర్చల పురోగతిపై ఆశలతో పాటు క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 95 డాలర్ల కిందకి దిగిరావడంతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఒక శాతం లాభపడింది. సెన్సెక్స్‌ 753 పాయింట్లు పెరిగి 79,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 212 పాయింట్లు బలపడి 24,577 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.

క్యాపిటల్‌ గూడ్స్‌ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్‌ ఆద్యంతం స్థిరమైన లాభాలతో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్‌  847 పాయింట్లు పెరిగి 79,367 వద్ద, నిఫ్టీ 237 పాయింట్లు ఎగసి 24,602 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. సూచీలు ఒక శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని  మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.469 లక్షల కోట్లకు చేరింది. 

ఆసియాలో దక్షిణ కొరియా (2.65%), తైవాన్‌ (1.72%), జపాన్‌(1%), హాంగ్‌కాంగ్‌(0.48%), సింగపూర్‌ (0.22%), చైనా (0.07%) లాభపడ్డాయి. యూరప్‌లో ఫ్రాన్స్‌ (–0.40%), బ్రిటన్‌ (–0.50%) మార్కెట్లు నష్టపోగా, అయితే  జర్మన్‌ (0.10%) పెరిగింది. అమెరికా స్టాక్‌ సూచీలు స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. 

రంగాల వారీగా బీఎస్‌ఈ ఇండెక్సుల్లో ఎఫ్‌ఎంసీజీ (2.23%), రియల్టీ (2.17%), ప్రైవేటు బ్యాంకులు (1.71%), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (1.32%), టెలికమ్యూనికేషన్‌ (1.14%), పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ (1%) పెరిగాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు వరుసగా 0.79%, 0.29 శాతం లాభపడ్డాయి.  
మార్చి త్రైమాసిక నికర లాభం 19% వృద్ధితో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 8% పెరిగి రూ.979 వద్ద స్థిరపడింది.  

28 పైసలు క్షీణించిన రూపాయి 
డాలర్‌ మారకంలో రూపాయి విలువ 28 పైసలు బలహీనపడి 93.44 వద్ద ముగిసింది. పశ్చి మాసియా శాంతి చర్చలపై అనిశ్చితి, క్రూడ్‌ ధరల్లో ఒడిదుడుకులు వంటివి రూపాయిపై ఒత్తిడి పెంచాయి. నాన్‌–డెలివరబుల్‌ ఫార్వర్డ్‌(ఎన్‌డీఎఫ్‌) మార్కెట్లలో స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌పై ఆర్‌బీఐ నియంత్రణలను సడలింపు నిర్ణయమూ దేశీయ కరెన్సీపై ప్రభావం చూపిందని నిపుణులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement