ప్రపంచ ప్రఖ్యాత ప్రసార సంస్థ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీపీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఆర్థిక భారంతో సతమతమవుతున్న ఈ సంస్థ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో దాదాపు 500 మిలియన్ పౌండ్ల (677 మిలియన్ డాలర్లు) వార్షిక బడ్జెట్‌లో 10 శాతం మేర పొదుపు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
దశాబ్ద కాలంలోనే భారీ కోతలు
బీబీసీ చరిత్రలో గత పదేళ్ల కాలంలో ఇవే అతిపెద్ద తొలగింపులు. తాత్కాలిక డైరెక్టర్ జనరల్ రోడ్రి తల్ఫాన్ డేవిస్ సిబ్బందికి పంపిన ఈమెయిల్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘ఈ నిర్ణయం సిబ్బందిలో అనిశ్చితిని సృష్టిస్తుందని నాకు తెలుసు. కానీ సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల పట్ల మేము పారదర్శకంగా ఉండాలనుకుంటున్నాం’ అని డేవిస్ పేర్కొన్నారు.
కారణాలు ఏమిటి?
అదుపులో లేని ద్రవ్యోల్బణం.
లైసెన్స్ ఫీజు, వాణిజ్య ఆదాయంపై పెరిగిన ఒత్తిళ్లు.
ప్రపంచవ్యాప్తంగా అస్థిరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ.
నాయకత్వ మార్పు
గత జనవరి 6న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎడిటింగ్‌లో జరిగిన పొరపాట్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో న్యూస్ హెడ్ డెబోరా టర్నెస్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రంప్ ఇప్పటికే బీబీసీపై 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేయడం సంస్థకు మరింత తలనొప్పిగా మారింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ మాట్ బ్రిటిన్ వచ్చే నెలలో కొత్త డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 1, 2027 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో మరింత కఠినమైన పొదుపు చర్యలు ఉంటాయని సంస్థ సంకేతాలిచ్చింది.
ఇదీ చదవండి: కాకమీదున్న పసిడి ధరలు


