లారీ యజమానుల నిరసన | - | Sakshi
Sakshi News home page

లారీ యజమానుల నిరసన

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

టోల్‌గేట్‌ నిర్వాహకుల అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు

మార్టూరు: స్థానిక జాతీయ రహదారిపై మండల పరిధిలోని బొల్లాపల్లి టోల్‌గేట్‌ అధికారుల అరాచకాలపై లారీ యజమానులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. అందిన వివరాల మేరకు.. మండల పరిధిలోని గ్రానైట్‌ సరుకు, సుబాబుల్‌ కర్రల లోడ్‌లు నిత్యం ఈ టోల్‌గేట్‌ పరిధిలో ప్రయాణిస్తుంటాయి. ఏ లోడు అయినా సరే లారీలోకి ఎక్కించాక వే బ్రిడ్జిల వద్ద యాజమాన్యం తూకం వేయించి బిల్లులను లారీ డ్రైవర్ల ద్వారా పంపిస్తుంటారు. ఈ విధంగా కాటా వేసిన వాహనాలు టోల్‌గేట్‌ బిల్‌ వసూళ్ల కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వే బ్రిడ్జిలలో గతంలో తూకం వేసిన వే బిల్లులోని బరువు కంటే ఏమాత్రం అధికంగా కనిపించినా టోల్‌ గేట్‌ సిబ్బంది వాహనాలను ముందుకు వెళ్లనివ్వకుండా కొంతకాలంగా ఆపివేస్తున్నారు. దీనివలన వరుసలో వెనుక ప్రయాణించే వాహనాల ప్రయాణికులు గంటల కొద్ది జాప్యం జరుగుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివల్ల నిత్యం టోల్‌గేట్‌ వద్ద ఏదో ఒక సమయంలో గొడవలు జరుగుతున్నా టోల్‌గేట్‌ మేనేజర్‌ కానీ ఆపై అధికారులు కానీ సమస్యపై దృష్టి పెట్టకపోవడంతో వాహనాల యజమానులు, డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టోల్‌గేట్‌ సిబ్బది నిర్వాకం..

ఈ క్రమంలో గత శుక్రవారం అర్ధరాత్రి ఓ గ్రానైట్‌ లారీని అధిక బరువు ఉన్నది కనుక బరువుకు అదనంగా టోల్‌ ఫీజు చెల్లిస్తేనే కానీ వాహనాన్ని వెళ్లనీయమని లారీని ఆపారు. లారీ యజమాని ఇచ్చిన వే బిల్లు ప్రకారం తాము వెళతామే కానీ అదనపు బరువుకు సంబంధించిన అదనపు రుసుం చెల్లించటానికి తమ వద్ద నగదు ఉండదని ఆ లారీ డ్రైవర్‌ చెప్పినప్పటికీ సిబ్బంది వినిపించు కోలేదు. కొంత వాదోపవాదాల అనంతరం టోల్గేట్‌ సిబ్బంది వాహనాన్ని ముందుకు వెళ్లకుండా వెనుకకు రప్పించి ఆ ప్రాంతంలోనే పక్కన పెట్టించారు. లారీ డ్రైవర్‌ వద్ద నుంచి వాహనానికి సంబంధించిన తాళాలతోపాటు అతని సెల్‌ ఫోన్‌ సైతం బలవంతంగా లాక్కున్నారు. డ్రైవర్‌ను వెనక్కి పంపించారు. ఈ క్రమంలో సహనం నశించిన వాహనాల యజమానులు శనివారం రాత్రి టోల్‌గేట్‌ వద్ద సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. సీఐ వై శ్రీనివాసరావు, ఎస్‌ఐ బాబురావులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాలతో మంతనాలు జరిపారు. లారీ యజమానులు టోల్‌ గేట్‌ మేనేజరు సిబ్బంది వలన తాము పడుతున్న మానసిక సంఘర్షణ గురించి అధికారుల వద్ద ఏకరువు పెట్టారు. చివరగా సీఐ మాట్లాడుతూ సోమవారం టోల్‌గేట్‌ కు సంబంధించిన ఉన్నతాధికారులను పిలిపించి మాట్లాడతామని సర్దిచెప్పడంతో వాహన యజమానులు తాత్కాలికంగా నిరసన విరమించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement