చోరీ కేసులో నిందితుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్‌

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్‌

రూ. ఐదు వేల నగదు, కారు స్వాధీనం

తెనాలిరూరల్‌: పట్టపగలు ఇంట్లో చోరీకి పాల్పడిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేవలం నిందితుడు కారులో పరారయ్యాడన్న ఆధారంతో సాంకేతికతను వినియోగించి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. స్థానిక రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంతో సీఐ నాయబ్‌ రసూల్‌ శనివారం వివరాలు వెల్లడించారు. మండలంలోని హాఫ్‌ఫేట గ్రామానికి చెందిన రెడ్డి వెంకటరవికిరణ్‌ తన తల్లి లక్ష్మీసామ్రాజ్యంను ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు బ్యాంకుకు తీసుకువెళ్లాడు. 11.50 గంటల సమయంలో అతని రెండో అక్క తోటకూర సామ్రాజ్యం ఫోన్‌ చేసి ఇంట్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బయటకు వచ్చాడని, తనను చూసి వేగంగా వెళ్లి సమీపంలో ఉన్న తెల్ల కారులో పరారయ్యాడని చెప్పింది. రవికిరణ్‌ వెంటనే ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. లోపల బీరువా తాళాలూ పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని రూ. 25 వేలు అపహరించుకెళ్లాడు. ఇదే విషయాన్ని రవికిరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్‌ ఎస్‌ఐ కె. ఆనంద్‌ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారైన సమయంలో ఆ మార్గంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లు పరిశీలించి కారు నంబరును గుర్తించగలిగారు. సాంకేతికతను వినియోగించి కారు కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. కారు విజయవాడ నుంచి తెనాలి వైపు వస్తున్నట్టు గుర్తించి నందివెలుగు ప్రధాన జంక్షన్‌లో అరెస్ట్‌ చేశారు. నిందితుడిని ఖమ్మం జిల్లా మధిర మండలం మదుపల్లి గ్రామానికి చెందిన బండి గోపిగా గుర్తించారు. నిందితుడి నుండి రూ.ఐదు వేల నగదు, కారును స్వాధీనపర్చుకున్నారు. నిందితుడిపై తెలంగాణలో తొమ్మిది, ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు ఉన్నాయని, మరో 20 కేసులు కోర్టు కొట్టివేసిందని సీఐ తెలిపారు. సాంకేతికతను వినియోగించి నిందితుడిని అతి త్వరగా అరెస్ట్‌ చేసిన ఎస్‌ఐ ఆనంద్‌, సిబ్బందిని సీఐ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement