ఎస్సీలకు భూహక్కు పత్రాల పంపిణీకి చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీలకు భూహక్కు పత్రాల పంపిణీకి చర్యలు

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

ఎస్సీలకు భూహక్కు పత్రాల పంపిణీకి చర్యలు

భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం కృషి

బాపట్ల: ఎస్సీలకు సంపూర్ణ భూహక్కు పత్రాలు ఇచ్చేందుకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తెలిపారు. భూముల సమస్యలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీలకు పంపిణీ చేసిన భూములకు సంపూర్ణ హక్కు కల్పిస్తామని కలెక్టర్‌ చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి జిల్లాలో 512 మంది ఎస్సీ లబ్ధిదారులకు భూమి కొనుగోలు పథకం కింద కేటాయించినట్లు వివరించారు. ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆ మేరకు 28.7 ఎకరాల భూమిని పరిశీలించి అర్హులకు అందిస్తామని తెలిపారు. అధికారులు బెదిరింపులకు భయపడవద్దన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్‌, డీఆర్‌ఓ జి.గంగాధర్‌ గౌడ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అర్జున్‌ నాయక్‌, ఆర్డీవోలు హరికుమార్‌, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

రక్తదాతలు సామాజిక హీరోలు

రక్తదాతలు సామాజిక హీరోలు అని బాపట్ల జిల్లా కలెక్టర్‌, రెడ్‌క్రాస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ అన్నారు. జూన్‌ 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన వారికి ‘రక్తదాత సుఖీభవ ‘అవార్డు ప్రదానం, రక్త పరీక్షల క్యాంపుల నిర్వహణ, కళాశాలల్లో విద్యార్థులకు రక్తదాన ఆవశ్యకతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని రెడ్‌ క్రాస్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ చెప్పారు. అనంతరం ప్రపంచ రక్త దాతల పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ జిల్లా ట్రెజరర్‌ ప్రసాద్‌ రెడ్డి, సభ్యులు అల్లాడి రవికుమార్‌, జాషువా, నవనీతం పాల్గొన్నారు.

ఉద్యోగులకు సురక్షిత తాగునీరు

కలెక్టరేట్‌లో పని చేస్తున్న ఉద్యోగులు, సందర్శకులకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి రూ.3 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్‌ రిబ్బన్‌ కత్తిరించి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టరేట్‌ ఏవో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం ఉన్న పథకాలను ఉపయోగపడే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. బాల కార్మిక నిర్మూలన జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో కార్మికుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. పథకాలను సద్వినియోగం చేసుకునేలా కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. బాల కార్మిక నిర్మూలనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ చెప్పారు. జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ విస్తృతంగా తనిఖీలు చేయాలన్నారు. ఈనెల 30వ తేదీ వరకు బాల కార్మికుల నిర్మూలనపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌, కార్మిక శాఖ సహాయ కమిషనర్‌ వెంకట శివప్రసాద్‌, కమిటీలోని అనుబంధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement