రైతుల శ్రమను తగ్గించే పరిశోధనలు అవసరం | - | Sakshi
Sakshi News home page

రైతుల శ్రమను తగ్గించే పరిశోధనలు అవసరం

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

రైతుల శ్రమను తగ్గించే పరిశోధనలు అవసరం ● ఐఐఎఫ్‌ఎల్‌ సంస్థ ఫైనాన్స్‌ బోర్డ్‌ చైర్మన్‌ డాక్టర్‌ గోవిందరాజులు ● రైతుల ఆదాయం పెంచే విధంగా పరిశోధనలు జరగాలి ● జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ ● వేడుకగా ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం

గుంటూరు రూరల్‌: రైతుల శ్రమను తగ్గించి ఆదాయం పెంచే విధంగా పరిశోధనలు చేయాలని నాబార్డు మాజీ చైర్మన్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సంస్థ ఫైనాన్స్‌ బోర్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు సూచించారు. శుక్రవారం నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ పీవి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. డాక్టర్‌ గోవిందరాజులు మాట్లాడుతూ భారత వ్యవసాయం ఇప్పటికీ వర్షాకాలంపై ఆధారపడి ఉందన్నారు. దీని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, సాంకేతికత ఆధారితంగా, పర్యావరణ హితంగా, తక్కువ వ్యయంతో సాగుచేసే విధంగా రైతుల శ్రమను తగ్గించేలా తీర్చిదిద్దడంపై ప్రముఖ విద్యాసంస్థలు దృష్టి సారించాలన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలు ఉత్పత్తి ఖర్చులు తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఈ దిశగా త్వరలో ఎంటెక్‌ అగ్రి–ఇంజినీరింగ్‌లో ఏఐపై కోర్స్‌ను ప్రవేశ పెట్టబోతున్నామని, అలాగే అగ్రి స్కిల్‌ సెంటర్లు, ప్రతి జిల్లాలో ఫార్మ్‌ మెకనైజేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్లు, ఫార్మ్‌ మెకనైజేషన్‌ టెక్నీషియన్‌ కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ జిల్లాలోని రైతుల ఆదాయం పెంచడంలో, ఆహారభద్రత కల్పించడంలో, పురుగుమందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారం అందించడంలో పరిశోధనలు జరగాలని కోరారు. ఎల్‌నినో ప్రభావిత ప్రాంతాలలో రైతుల ఆదాయం పడిపోకుండా, ఈ పరిస్థుతులని తట్టుకొనే సాంకేతికతను అందించడం లో యూనివర్సిటీ సహకరించాలని కోరారు. ప్రాంతీయ పరిశోధన స్థానం లాం ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement