నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా తయారు చేయాలి
డీఆర్వో షేఖ్ ఖాజావలి
గుంటూరు వెస్ట్: భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టినట్లు జిల్లా రెవెన్యు అధికారి షేఖ్ ఖాజావలి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బందిగా పనిచేస్తారన్నారు. బూత్ స్థాయి అధికారులు(బీఎల్వో ) లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితా నిర్వహణ బాధ్యత పూర్తిగా బీఎల్ ఓ లదే అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ సమయంలో బీల్వో ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు , తెనాలి ఆర్డీఓ రమణి, డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.
ఏఆర్ ఆర్‌ఐగా కృష్ణయ్య
నగరంపాలెం: జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగపు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)గా కె.కృష్ణయ్య శుక్రవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఏఆర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. 2013 బ్యాచ్‌కు చెందిన కె.కృష్ణయ్య గతంలో గుంటూరు హోంగార్డ్స్ విభాగం, బీడీ టీమ్, ఆక్టోపస్ మంగళగిరి, ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. ఈ ఏడాదిలో ఆర్‌ఐగా ఉద్యోగోన్నతి పొంది, రిపోర్ట్ చేశారు.


