అర్హత పరీక్ష లేకుండా ఉపాధ్యాయ నియామకాలు న్యాయమా! | - | Sakshi
Sakshi News home page

అర్హత పరీక్ష లేకుండా ఉపాధ్యాయ నియామకాలు న్యాయమా!

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

నెహ్రూ నగర్‌: డీఎస్సీ రాత పరీక్ష లేకుండానే క్రీడల సర్టిఫికెట్ల ఆధారంగా 382 మంది ఉపాధ్యాయులను నియమించడం విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక జన చైతన్య వేదిక హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్‌ 19న విడుదల చేసిన జీఓ నంబరు 4, 47 ద్వారా రాత పరీక్ష లేకుండా కేవలం క్రీడల ప్రతిభ ఆధారంగా 421 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక చేపట్టిందని తెలిపారు. అస్మదీయులకు దొడ్డిదారిన 382 మందికి క్రీడల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు ఇవ్వడం మంచిది కాదన్నారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు 74 ప్రకారం క్రీడా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ నియామకాలు పొందాలంటే సంబంధిత రాత పరీక్షలు తప్పనిసరి అని, మెరిట్‌ ఆధారంగానే నియామకాలు జరిగేవని గుర్తుచేశారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం రాత పరీక్ష లేకుండానే నియామకాలు చేపట్టడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్లకు ఇచ్చిన వెయిటేజీపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయని, నకిలీ లేదా వివాదస్పద సర్టిఫికెట్లపై పూర్తి పరిశీలన జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. అన్ని క్రీడలకు సమాన అవకాశాలు లభించాయా అనేది ప్రశ్నార్థకమన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగానికి బోధనా నైపుణ్యం కూడా అవసరమని, కేవలం ఆటల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా 270 మందికి నియామకాలు ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థకు నష్టం కలుగుతుందని తెలిపారు. స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో పారదర్శకత కరువైందని, ఇది వ్యవస్థాకత కుంభకోణమని అభివర్ణించారు. రాత పరీక్ష లేకుండా 382 ఉపాధ్యాయ పోస్టుల నియామకం జరిగిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ స్పష్టం చేశారని తెలిపారు. నియామకాలు పూర్తయిన వెంటనే భవిష్యత్‌లో రాత పరీక్షల ఆధారంగానే స్పోర్ట్స్‌ కోటా నియామకాలు జరపాలని ఉత్తర్వులు ఇవ్వడం తమ తప్పులను సరిదిద్దుకోవడానికేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ నిర్వహించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement