అందరి సహకారంతో శివాలయం అభివృద్ధి
పెదకాకాని: అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ధర్మకర్తల మండలి నూతన చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు అన్నారు. పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం గురువారం ఘనంగా జరిగింది. మొత్తం 13 మంది పాలకమండలి సభ్యులతోపాటు ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి ధనమహేశ్వరప్రసాద్‌లచే ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కోసూరు పూర్ణచంద్రరావును చైర్మన్‌గా పాలకవర్గం సభ్యుడు వరికూటి వీరసుధాకర్ ప్రతిపాదించగా మరొక సభ్యుడు కంభంపాటి వెంకయ్య బలపరచడంతో కోసూరి పూర్ణచంద్రరావును పాలకవర్గం చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్ సమక్షంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ కోసూరి మాట్లాడుతూ స్వామివారికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, తన నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ నూతన పాలకవర్గం సభ్యులుగా చేబ్రోలు వెంకట భాస్కర పున్నారావు, కంభంపాటి వెంకయ్య, కొమ్మూరి మల్లికార్జునరావు, భైరపనేని ధనలక్ష్మి, కొండా లత, ధూపాటి శివ శంకరరావు, వడ్లమూడి సువర్ణలక్ష్మి, వుల్లం రాజేశ్వరి, బండారు మల్లేశ్వరి, వరికూటి వీర సుధాకరరావు, బాణావత్ మంగమ్మ, పాముదుర్తి నాగలక్ష్మి, ఎక్స్‌అఫిషియోసభ్యుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్‌లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


