తిరునాళ్లలో సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
చినగంజాం: శివరాత్రి తిరునాళ్ల నిర్వాహణలో సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆలయాల కమిటీలు చర్యలు తీసుకోవాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సూచించారు. శివరాత్రి తిరునాళ్లను పురస్కరించుకొని ఆయన గురువారం చినగంజాంలోని లలితా రామకోటేశ్వరస్వామి ఆలయం, బాలకోటేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. రెండు ఆలయ కమిటీలు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాయి. ఆయన ఆలయాల పరిసర ప్రాంతాలను, క్యూలైన్‌ల ఏర్పాట్లను, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించే ప్రదేశాలను, విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసే స్థలాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ప్రసిద్ధి గాంచిన రెండు దేవాలయాలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ, దేవదాయ, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్యం, విద్యుత్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఆలయ కమిటీలతో సమావేశం నిర్వహించారు. గతేడాది భక్తులు 30 వేల మందికిపైగా వచ్చినట్లు అంచనాలున్నాయని, ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, తగిన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్యూలైన్‌లు, బారికేడ్లు, పార్కింగ్ ప్రదేశాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ల్ ద్వారా నిఘా ఉంచుతామన్నారు. ఆలయ ప్రాంగణంలో వృద్ధులకు, చిన్నపిల్లలకు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ముఖ్యంగా రెండు ఆలయాలకు వచ్చే భక్తుల్లో 80 శాతం మంది రైల్వే ట్రాక్‌లు దాటుకొని వస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు సమన్వయంతో తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. చీరాల ఆర్డీఓ కె.చంద్రశేఖర్ నాయు డు, డీఎస్పీ ఎండీ మొయిన్, తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, ఎంపీడీఓ ధనలక్ష్మి, ఎస్‌బీ సీఐ నారాయణ, ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, ఎస్‌ఐ శీలం రమేష్, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్పీ ఉమామహేశ్వర్ సూచన


