మోంథా తుఫాన్ నేపథ్యంలో..
బలహీన పడిన కాలువ కట్టలు ప్రతి తుఫాన్‌కు కాలువ కట్టలకు గండ్లు నీట మునుగుతున్న వరి పొలాలు... నష్టపోతున్న రైతులు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయకట్టు రైతుల డిమాండ్
చీరాల అర్బన్: చంద్రబాబు సర్కార్‌లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కొమ్మమూరు ఆయకట్టు జిల్లా ధాన్యాగారం. ఏడాదికి రెండు పంటలు. మాగాణి రైతులకు సిరులు కురిపించిన ఆయకట్టు. రైతు, రైతు కూలీలమని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఏడాదికి ఒక పంటకే పరిమితమైన పరిస్థితి. సకాలంలో సాగునీరు అందకపోవటం అందుకు కారణం. ప్రకృతి వైపరీత్యాలతో కాలువ కట్టలకు గుండ్లు పడి వరదనీరు పంటలను ముంచెత్తుతున్నాయి. ప్రతి ఏడాది తాత్కాలిక మరమ్మతులతో అధికారులు మమ అనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెడబ్ల్యూడీ (కృష్ణా వెస్ట్రన్ డెల్టా)లోని కొమ్మమూరు కాలువకు గండ్లు పడకుండా, ఇతర మరమ్మతులు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి తమకు న్యాయం చేయాలని ఆయకట్టు రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
మట్టి పనులతో మమ..
కాలువ కట్టలకు గండ్లు పడటం, వాటిని పూడ్చటం పరిపాటిగా మారింది. మట్టి పనులు ఏ మేరకు చేశారనేది నీటి మీద రాతల మాదిరిగా ఉంటాయని రైతులు అంటున్నారు. ప్రతి ఏడాది వరదల సమయంలో పంట నష్టపోతున్న తమ సమస్యపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మట్టి పనులయితే ఎవరి వంతు లబ్ధి వారికి చేకూరుతుందనే కోణంలో పాలకులు, అధికారులు అడుగులు వేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
నీటి తీరువా వసూళ్లు అంతంత మాత్రమే..
ఆయకట్టు పరిధిలో నీటి తీరువా వసూళ్లు బాధ్యత రెవెన్యూ శాఖది. నీటి తీరువా వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. పంటలు నీట మునిగి నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో రైతులు నీటి తీరువాను కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. సక్రమంగా సాగునీరు అందించి, పంటలు నష్టపోకుండా చర్యలు చేపడితే తమకు నీటి తీరువా చెల్లించటం ఏ మాత్రం భారం కాదని రైతులు చెబున్నారు.
నేటికీ అందని పంట నష్టపరిహారం..
మోంథా తుఫాన్ నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం నేటికీ అందలేదు. కేంద్ర ప్రభుత్వ బృందం నివేదికపై అందాల్సిన నష్టపరిహారం ఎప్పటికి మంజూరు అవుతుందో తెలియని పరిస్థితి. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెప్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
వేసవికి ముందే తాగునీటి చెరువులు నింపుకోవాల్సిన ఆవశ్యకత
ప్రస్తుతం కొమ్మూరు కాలువలో నీరు పుష్కలంగా ఉంది. ఈ క్రమంలో కాలువలో పారుదల ఆగే లోపు ఒక పర్యాయం తాగునీటి చెరువులకు నీరు నింపేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. అలానే మున్సిపల్ పరిధిలో కూడా సమ్మర్ స్టోరేజి ట్యాంకులకు కూడా నీరు నింపుకునేందుకు కూడా మున్సిపల్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
కొమ్మమూరు ఆయకట్టు పరిధిలో అధికారికంగా, అనధికారికంగా సుమారు 3,70,000 ఎకరాల సాగుభూమి ఉంది. ప్రధాన పంటవరి. గతంలో ఖరీఫ్, రబీలో రెండు పర్యాయాలు వరి పండించేవారు. కానీ కాలక్రమేణా అది ఒక పంటకు పరిమితం అయ్యింది. దీంతో లేట్ ఖరీఫ్ లేదా రబీలలో సాగుచేస్తున్నారు. సాగునీరు సక్రమంగా అందుతుందో లేదో తెలియని స్థితి. దీంతో ఆయకట్టు పరిధిలో మాగాణి సాగు గాలిలో దీపంలా తయారయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది మోంథా తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. తిరిగి వరి నాట్లు వేయాల్సిన పరిిస్థ్ధితి ఏర్పడింది. దీంతో సాగుదారులకు ఆర్థిక భారం పెరిగింది.
వర్షాలకు కొమ్మమూరు కాలువకు అధికార గణాంకాల ప్రకారం చీరాల డీఈఈ కార్యాలయ పరిధిలో 123 గండ్లు పడ్డాయి. అయితే మరి కొన్ని గండ్లు కూడా పడ్డట్లు రైతులు చెబున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు గండ్లు పూడ్చారు. చిన్న, చిన్న గండ్లును రైతులే అవసరమైనచోట పూడ్చుకున్నారు. ఇది వారికి అదనపు భారం.


