మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు

Feb 13 2026 3:33 AM | Updated on Feb 13 2026 3:33 AM

మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు

మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల: మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు.

మహాశివరాత్రి పండుగ సందర్భంగా 65 శివాలయాలలో ఉత్సవాలు జరుగుతాయని కలెక్టర్‌ చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

దేవాలయాలలో పూజా కార్యక్రమాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో చేరితే సురక్షితమైన విధానంలో క్రమబద్ధంగా నియంత్రణ చేయాలన్నారు. ప్రతి ఆలయంలో క్యూ పద్ధతిని అమలు చేయాలన్నారు.

విగ్రహాల భద్రత, దొంగతనాలు, తొక్కిసలాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు.

భక్తులకు తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలు అధికంగా వచ్చే ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఆధిపత్యం కోసం గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే కలెక్టరేట్‌ లోని కంట్రోల్‌ రూమ్‌కి సమాచారం ఇవ్వాలన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 14, 15, 16 తేదీల వరకు మద్యం దుకాణాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు.

అమర్తలూరు మండలంలో గోవాడ గ్రామం, రేపల్లె మండలం అడవిపల్లి గ్రామంలో బాల కోటేశ్వర స్వామి దేవాలయం, చిన్నగంజాం మండలం సోపిరాల గ్రామం, చిన్నగంజాం మండలం బాలకోటేశ్వర స్వామి దేవాలయం, చుండూరు మండలం బాలకోటేశ్వర స్వామి దేవాలయం కొల్లూరు మండలం కోటిపల్లి శివాలయాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారన్నారు.

ప్రాచుర్యం పొందిన దేవాలయాలున్న ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నడపాలని కలెక్టర్‌ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు దేవాలయాలలో నిర్వహించే ఉత్సవాలపై అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి ఆలయం వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు 200 లీటర్ల సామర్థ్యం ఉండే రెండు డ్రమ్ములకు నీరు నింపి బకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

మాట్లాడుతూ ...

శివరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ చెప్పారు. ఆలయ ప్రాంగణంలో జాగ్రత్తలు, వెలుపల వైపు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

దేవాలయాల వద్ద శుక్రవారం నుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. 13వ తేదీ సాయంత్రంలోగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

బందోబస్తు అవసరమైన చోట అధికారులు ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. అధికారులంతా తప్పనిసరిగా సమన్వయంతో పర్యవేక్షణ చేయాలని పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ లవన్న, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డీఎల్‌డీవోలు,తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement