బాల సదనం నుంచి ఇద్దరు చిన్నారులు పరారీ
రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్లు గుర్తించి తీసుకొచ్చిన పోలీసులు
బాపట్ల టౌన్: బాపట్లలోని బాలిక సదనంలో 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వసతిగృహం నుంచి పారిపోయారు. తల్లిదండ్రులు లేని వారు, అనాథలు, రక్షణ కరువైన బాలికలకు నీడ కల్పించడమే బాల సదనం ముఖ్య ఉద్దేశం. 6–18 ఏళ్ళలోపు బాలికలకు ఉచిత ఆశ్రయంతోపాటు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బుధవారం అర్ధరాత్రి బాపట్ల బాలిక సదనంలో జరిగిన ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. వసతిగృహం వార్డెన్లు, సూపరింటెండెంట్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. సహచర విద్యార్థులు ఈ విషయాన్ని చెప్పడంతో గంట తర్వాత వారు అప్రమత్తమయ్యారు. ఆచూకీ లభించకపోవడంతో రాత్రి 10.30 గంటల సమయంలో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో గాలించారు. పట్టణ శివారులోని కంకటపాలెం గేటు సమీపంలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కొన్నేళ్లుగా వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. అధికారులు వారిని చిత్రహింసలకు గురిచేయటం, వెట్టిచాకిరి చేయించడంతోనే పారిపోవాల్సి వచ్చిందని సమాచారం. ఇటీవల బంధువులకు ఫోన్ చేసినప్పుడు కూడా తాము ఇక్కడ ఉండలేకపోతున్నామని, ఇంటికి వచ్చేస్తామని వాపోయినట్లు తెలిసింది. బాల సదనం సూపరింటెండెంట్ ఎస్.సుబ్బలక్ష్మి మాట్లాడుతూ... హాస్టల్ గేటుకు వేసిన తాళాలు తీసుకొని వారిద్దరు పారిపోయారని, పోలీసుల సహాయంతో రాత్రి 10.45 గంటల సమయంలో తిరిగి తీసుకొచ్చామని తెలిపారు.


