మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ
కర్లపాలెం: నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. మంగళవారం గుండెపోటుతో మృతి చెందిన నక్కా నాగేశ్వరరావు భౌతికకాయాన్ని బాపట్ల ఏరియా వైద్యశాల నుంచి స్వగ్రామం తరలించేందుకు ఆర్థిక స్థోమత లేక కుటుంబ సభ్యులు బైక్‌పై తీసుకువెళ్ళిన సంఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగేశ్వరరావు భార్యకు భర్త మరణ ధ్రువీకరణ పత్రం అందజేశారు. వితంతు పింఛను మంజూరు చేయటంతోపాటు నివాస స్థలం, పక్కా గృహం మంజూరు చేయాలని కలెక్టర్ స్థానిక అధికారులను ఆదేశించారు. అనంతరం రెడ్‌క్రాస్ ప్రతినిధులు పేద కుటుంబాలకు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పి.గ్లోరియా, జిల్లా ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్బులు తదితరులు ఉన్నారు.
అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
బాపట్ల: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రవాణా చార్జీల మేరకే ఫీజులు వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనివార్య పరిస్థితుల్లో రోగులు మృతి చెందిన సందర్భాల్లో మృతదేహాన్ని గౌరవప్రదంగా తరలించే బాధ్యత సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్‌లదేనని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలో బైకుపై మృతదేహం తరలింపు ఘటనపై మంత్రి పార్థసారథి ఆరా తీశారు.
రోగులకు మెరుగైన వైద్యం అందాలి
ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలను జిల్లా కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. రోగులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. సంతృప్తి స్థాయిలో వైద్యం అందించాలని చెప్పారు. రోగులతో మాట్లాడారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీసీహెచ్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ తదితరులు ఉన్నారు.


