విధులు బారెడు .. నిధులు మూరెడు
గత ఎమ్మెల్యేకి ... ప్రస్తుత ఎమ్మెల్యేకి ఎంతో తేడా ..!
గత ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి, ప్రస్తుత ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్యకు ఎంతో తేడా ఉందని ప్రజలు అంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి రైతాంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. పంపింగ్ స్కీమ్‌లు, ఇతర పంట కాలువల మరమ్మతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు, రైతు ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేవారు. దీంతో పంటలు నష్టపోకుండా ఉన్నాయని రైతులు చెబుతున్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే కొండయ్య పలు సందర్భాల్లో రైతాంగ సమస్యలకు సంబంధించి చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటికి పలు సందర్భాల్లో మీడియా సాక్షిగా అసభ్య పదజాలం వాడుతూ సవాళ్లు విసరటంపై చూపిన శ్రద్ధ ప్రజల సమస్యల పరిష్కారంపై చూపటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అందుకు గతంలో సముద్రంలో యువకులు మృతి చెందిన సమయంలోను, తాజాగా గడియార స్తంభం సెంటర్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుకు సంబంధించిన ఎపిసోడ్‌లో మంగళవారం మాట్లాడిన మాటలు అందుకు నిదర్శనమంటున్నారు.
అలాంటి విషయాలపై కన్నా రైతాంగం, చేనేత, మత్స్యకార, ఇతర వర్గాల సమస్యల పరిష్కారంపై దృషిసారిస్తే బాగుంటుందని హితువు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ర్యాంకులు అంటూ చేసిన ప్రకటనలో చీరాలకు పనితీరు, అభివృద్ధి చూసి ఇచ్చారా, లేకుంటే పైరవీలు చూసి ఇచ్చారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పేరుకు డివిజన్ హెడ్ క్వార్టర్ ... పేరుకుపోతున్న పనులు
పట్టించుకోని పాలకులు, అధికారులు
వెంటాడుతున్న సిబ్బంది కొరత
నియామకాలపై దృష్టి కరువు
డ్రైనేజీ శాఖ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి
మెరుగైన సేవలు అందించేందుకు కృషి
చీరాల అర్బన్: చీరాల డ్రైనేజీ కార్యాలయం డివిజన్ హెడ్ క్వార్టర్.. విధులు ఎక్కువ నిధులు తక్కువగా ఉంది. వెంటాడుతున్న సిబ్బంది కొరత. పట్టించుకోని పాలకులు, అధికారులు. ఒక ఒక వైపు రైతాంగం, మరో వైపు సాధారణ ప్రజలు ఇలా అంతా ఇబ్బంది పడుతున్నారు. వీటిపై దృష్టి సారించాల్సిన ప్రజాప్రతినిధులు మీసాలు దువ్వుకోవటానికి, అసభ్య పదజాలంతో సవాళ్లు విసరడానికే పనికి వస్తున్నారని.. ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల అభివృద్ధిపై ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు చీరాల నియోజకవర్గానికి పనితీరును చూసి, లేక పైరవీలను చూసి ర్యాంకులు ఇచ్చారో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై స్పందించేవారని, ప్రత్యేకంగా రైతాంగ సమస్యలపై దృష్టి సారించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.
నాడు శంకుస్థాపన
చీరాలలో 1970లో కృష్ణా వెస్ట్రన్ డెల్టా డ్రైనేజి స్కీమ్ నేపథథ్యంలో కార్యాలయానికి అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి రొండా నారపరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎస్‌ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. అప్పట్లో విధులకు సరిపడా నిధులు, పనులకు తగ్గట్లు సిబ్బంది ఉండేవారని చెబున్నారు. అయితే కార్యాలయ విధులు వికేంద్రీకరణ నేపథ్యంలో ప్రస్తుతం డ్రైనేజీ చీరాల డివిజన్ కార్యాలయంగా ఉంది.
రైతులకు తప్పని తిప్పలు
చీరాల నియోజకవర్గంలో వ్యవసాయం, అనుబంధ వృత్తులే జీవనాధారంగా ఉన్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. డ్రైయినేజీ పరిధిలో ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్, వేటపాలెం స్ట్రయిట్‌కట్, కుందేరు ప్రధానమైనవి. స్ట్రయిట్ కాలువల కింద వేల ఎకరాల సాగుభూమి ఉంది. కొన్ని చోట్ల కనీస పూడికలు తీయక సాగునీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించిన వారికి నిధులు లేవనే సమాధానం వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కుందేరు ప్రక్షాళన పనులు కాగితాలకే పరిమితం అయింది. స్థానిక డ్రైనేజీ అధికారులకు డివిజన్ పరిధిలో విధులు ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా నిధులు లేవని చెబున్నారు. ఈ క్రమంలో రైతుల ప్రయోజనాలను కాపాడటంలో మురుగునీటి పారుదల శాఖ విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా ముంపునకు గురవుతున్న పొలాలు అందుకు నిదర్శనమంటున్నారు. దీంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది లేమితో..
డివిజన్ కార్యాలంలో ఈఈ ఒకరు, డీఈఈలు ముగ్గురు ఉన్నారు. ఏఈలు 16 మందికి గాను 12 మంది మాత్రమే ఉన్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ ఒకరు మాత్రమే ఉన్నారు. ఇక క్షేత్ర స్థాయిలో లస్కర్లు 180 మంది ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పనులు కుంటుపడుతున్నాయి. ఉన్న వారిపై పనిభారం పెరుగుతోంది. అయితే సిబ్బంది ఖాళీల భర్తీకి సంబంధించి అటు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక మరమ్మతులకు నోచుకోని డ్రైనేజీ కార్యాలయం, అతిథి గృహాలు ఆ శాఖ ఆర్థిక స్థితికి దర్పణం పడుతోందంటున్నారు.
ఉన్నంతలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల లేమి కొంతమేర ఉన్నమాట వాస్తవమే. క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఉంది. ప్రభుత్వానికి నివేదించాం.
– మురళీకృష్ణ, ఈఈ, మురుగునీటి
పారుదలశాఖ, చీరాల డివిజన్
విధులు బారెడు .. నిధులు మూరెడు


