కారులో చెలరేగిన మంటలు
మంగళగిరి టౌన్: కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన మంగళగిరి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు అనంతపూర్‌కు చెందిన ఆదిత్య జగ్గయ్యపేటలోని కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. గుంటూరులో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో బ్యాంకుకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు బుధవారం తన కారులో వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో తాడేపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతుండగా మంగళగిరి రత్నాల చెరువు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి రాత్రి 7.30 గంటలు అయ్యింది. ఈ క్రమంలో కారు బ్యానెట్‌లో నుంచి పొగలు రావడం ఆదిత్య గమనించాడు. వెంటనే కారు పక్కన ఆపి కారులో నుంచి దిగాడు. క్షణాల్లో కారులో మంటలు భారీగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు దాదాపుగా దగ్ధమైపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని, సుమారు 4 లక్షల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. పట్టణ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థి అవయవదానం
తాడేపల్లిరూరల్: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన విజయ్‌కుమార్ (20) తాడేపల్లిలోని ఓ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం విజయ్‌కుమార్‌కు బ్రెయిన్ డెడ్‌గా బుధవారం వైద్యులు నిర్ధారించారు. విజయ్‌కుమార్ తండ్రి సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు విజయ్‌కుమార్ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్‌దాన్ చైర్మన్ డాక్టర్ కె.రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో అవయవ దానం చేశారు. గుండె, కాలేయం మణిపాల్ హాస్పిటల్‌లో అవసరమైన వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగా, ఊపిరితిత్తులను హైదరాబాద్ కిమ్స్‌కు, కిడ్నీలకు విధాత హాస్పిటల్‌కు, కంటి కార్నియాను విజయవాడ ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు.
కారులో చెలరేగిన మంటలు


