పిన్నెల్లి సోదరులతో వైఎస్సార్ సీపీ నేతల ములాఖత్
వెల్దుర్తి: జంట హత్యల అక్రమ కేసులో జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను సోమవారం ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, పార్టీ వెల్దుర్తి మండల నాయకులు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా వెల్దుర్తి నాయకులు ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఇరికించి వారిని ఇబ్బందులకు గురిచేయటం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అందులో భాగంగానే పిన్నెల్లి సోదరులపై కుట్రతో జంట హత్యల కేసును బనాయించిందన్నారు. ఇలాంటి అక్రమ కేసులు తమ నాయకులను ఏమీ చేయలేవన్నారు. ములాఖత్ అయినవారిలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాయంకుల గోపాల్, మండాది సర్పంచ్ శీలం సైదారెడ్డి, కండ్లకుంట సొసైటీ మాజీ అధ్యక్షుడు తాడికొండ పుల్లారెడ్డి, కండ్లకుంట మాజీ సర్పంచ్ అమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు.
డీఎస్పీ ఎం.హనుమంతరావు
నరసరావుపేట టౌన్: మహాశివరాత్రి సందర్బంగా కోటప్పకొండ తిరునాళ్లలో ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు హెచ్చరించారు. సోమ వారం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన జరిగే కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా సాధారణ ప్రభలు 100, విద్యుత్ ప్రభలు 30 నుంచి 40 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆలయాల పరిసరాలలో డెకరేషనన్ లైటింగ్ ఏర్పాటు చేసే ప్రదేశాలు, విద్యుత్ ప్రభల వైర్ల వద్దకు భక్తులు, పిల్లలు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభల నిర్వాహకులకు సూచించారు. స్థానిక పోలీసు అధికారులు, ఆలయ కమిటీసభ్యులు, ప్రాథమిక ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారుల సమన్యయంగా వ్యవహరిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటారన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరునాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరునాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ముందుస్తు చర్యలు తీసుకున్నామని, వాహనాల పార్కింగ్‌కి అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల ఉత్సవాలు జరిగేలా భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. డీఎస్పీతో పాటు సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రేపు అండర్–17 జూనియర్ షూటింగ్
బాల్ జట్టు ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గుంటూరు రూరల్ లాల్‌పురంలోని కాటూరి పబ్లిక్ స్కూల్లో అండర్–17 బాలబాలికల సబ్ జూనియర్ పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్ చైర్మన్ మార్కపూడి రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు జనవరి 1, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 8639922978 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.


