హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సమావేశం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి సీతానగరంలోని సీతా భవన్‌లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యక్రమాలపై సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆరు నెలల కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల ప్రకారం మార్చి 8వ –10 తేదీ వరకు కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వామి వారి సూచనల మేరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి హంసల దీని వరకు దేవత వృక్షాలను నాటడం జరుగుతుందని తెలిపారు. ఆషాడ మాసం వ్యాస పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గ్రామాల కేంద్రంగా ఉన్న దేవాలయాల్లో నిరంతర పూజా కార్యక్రమాలు, దీప ప్రజ్వలనలు, ధూపదీప నైవేద్యాలు నిరాటంకంగా కొనసాగేందుకు ఆర్థిక సహకారం అందించే పెద్దల మద్దతుతో చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ట్ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్లు ఊడ్చి పీఏసీఎస్
ఉద్యోగుల నిరసన
కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శ్యామలానగర్‌లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చొక్కాలు విప్పి చీపుర్లు చేతబట్టి రోడ్లు శుభ్రం చేస్తూ, సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు, కోనసీమ జిల్లాలకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్‌ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పరభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌ను చేయించాలని సూచించారు.


