చందాలిస్తే..సమస్యలు పరిష్కరిస్తాం
చందాలిస్తే..సమస్యలు పరిష్కరిస్తాం సాక్షి ప్రతినిధి, బాపట్ల: అధికారాన్ని అప్పగిస్తే సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు ఊదరగొట్టారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ యాచన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. దానికి కొత్తగా పీ–4 అంటూ ఓ పేరు పెట్టారు. పేద కుటుంబాలను ధనవంతులుగా మారుస్తానంటూ ప్రగల్భాలు పలికారు. ఇప్పటికి ఎన్ని పేద కుటుంబాలు కోటీశ్వరులుగా మారారో మాత్రం లెక్క చెప్పడంలేదు. అన్ని పథకాలకు చందాలు వసూలు చేయడమే చంద్రబాబు ప్రభుత్వం పనిగాపెట్టుకుంది. ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమానికి నిధులు విడుదల చేసే పరిస్థితి లేదు. పేద విద్యార్థులు చదువుకునే వసతిగృహాలు మొదలు ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, అంగన్‌వాడీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తగినన్ని నిధులు ఇవ్వక గాలికి వదిలేసింది.
ఈ ప్రభుత్వం నిధులిచ్చేదిలేదు సమస్యలు పరిష్కరించేదిలేదు అనుకున్నారేమో! బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ సరికొత్త ఆలోచన చేశారు. గణతంత్ర దినోత్సవ నాడు ‘బాపట్ల సేవా సేతు’ వెబ్‌సైట్ ప్రారంభించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మౌలికవసతుల కల్పనకు దాతలు సాయం చేయాలన్నది వెబ్‌సైట్ సారాంశం. హాస్టళ్లలో వసతుల ఏర్పాటుతోపాటు సమస్యల పరిష్కారం. పాఠశాలలు అంగన్‌వాడీల్లోనూ మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నచిన్న పరికరాలు మొదలు రోగులకు అవసరమైన ఇతర వస్తువులను ఏర్పాటుతోపాటు మౌలిక వసతులను కల్పించడం లక్ష్యం. దాతల ద్వారా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నది కలెక్టర్ ఉద్దేశం. ప్రారంభ సందర్భంగా కలెక్టర్ స్వయంగా చీరాలలోని వసతిగృహాల విద్యార్థులకు బెడ్సు, ఇతర వస్తువులు సమకూర్చారు. దీనిపై క్షేత్రస్థాయిలో విసృత ప్రచారం కల్పించడంతోపాటు దాతలను తీసుకరావడం అధికారుల బాధ్యత.
మరోవైపు ఈ చందాల వసూలు కార్యక్రమంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ అధికారులందరూ దాతలను వెతకాల్సిన బాధ్యతను భూజానికెత్తుకున్నారు. కొందరు అధికారులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. సతిగృహాలు, పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం ఆ బాధ్యతనుంచి తప్పుకుంటే ఎలా అన్నది కొందరు అధికారుల వాదన. చందాలు అడగడం సరికాదని వాదిస్తున్నారు. ప్రభుత్వం నిధులివ్వకుండా చందాలు వసూలు చేయడమేంటని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్లను అద్దంలా మారుస్తామన్న చంద్రబాబు గుంతలు పూడ్చలేదని, అభివృద్ధి పనులకు నిధులివ్వక కనీసం మౌలిక వసతుల కల్పనకు నిధులివ్వలేరా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిదానికి ప్రభుత్వం చందాలు రూపంలో వసూళ్లకు దిగడంపైనే విమర్శలు వస్తున్నాయి.
● ప్రభుత్వ ఆస్పత్రులు, వసతిగృహాలు,
పాఠశాలలు, అంగన్‌వాడీలలో
సమస్యల తిష్ట
● నిధులివ్వని చంద్రబాబు ప్రభుత్వం
● చందాల కోసం ‘బాపట్ల సేవా సేతు’
వెబ్‌సైట్
● దాతలు ముందుకు రావాలని
కలెక్టర్ పిలుపు
● అధికారులకు దాతలను తెచ్చే బాధ్యత