వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం
మంగళగిరిటౌన్: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజులో భాగంగా ఉదయం స్వామివారికి పెళ్లికుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. గణపతిపూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవ మూర్తిని పెళ్లి కుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు మల్లేశ్వరుడి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామోత్సవంలో పెళ్లి కుమారుడిని దర్శించిన భక్తులకు పవిత్ర చేకూరి సకల శుభాలు అందుకుంటారనేది భక్తుల నమ్మకం. పట్టణానికి చెంది న జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతు లు పెండ్లి కుమారునికి మధుపర్కాలు సమర్పించారు. కార్యక్రమ ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు.


