ఇది రాజకీయమా .. కవ్వింపా..!
గడియార స్తంభం సెంటర్లో ఫ్లెక్సీల రగడ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ సర్కిల్ వద్ద టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు అక్కడ ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని గతంలోనే మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు ముందు జాగ్రత్తగా టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించిన పోలీసులు పోలీసులు సాక్షిగా తిరిగి అక్కడే ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటులో మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి కీలక పాత్ర ఆ సమయంలో ప్రేక్షణ పాత్ర పోషించిన పోలీసులు ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ శ్రేణులను కట్టడి చేసిన పోలీసులు ఫ్లెక్సీ తీసే వరకు ఆందోళన చేపడతామని వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్లకార్డులతో ఆందోళన, మానవహారం తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించి తొలగించిన పోలీసులు
ఎట్టకేలకు తొలగింపు
రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న చీరాల టీడీపీ శ్రేణులు
చీరాల అర్బన్(చీరాల): చీరాల టీడీపీ నేతలు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు. అది రాజకీయమా..లేక కవ్వింపా అని చీరాల గడియార స్తంభం సెంటర్లో శుక్రవారం జరిగిన ఘటన చూసి అక్కడి జనాలు ఇలా వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం సర్కిల్ వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయకూడదని గతంలో మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సర్కిల్ వద్ద టీడీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు అక్కడికి చేరారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించి సమీపంలో ఉన్న వీరరాఘవస్వామి దేవస్థానం వద్ద ఉంచారు. అయితే టీడీపీ శ్రేణులు పోలీసుల సాక్షిగా తిరిగి ఆ ఫ్లెక్సీని తిరిగి వైఎస్సార్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం విమర్శలకు తావిచ్చింది. దీనిపై వైఎస్సార్ సీపీ శ్రేణులు పోలీసులను ప్రశ్నించే క్రమంలో పోలీసులు, వైఎస్సార్ సీపీ శ్రేణులను అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి పంపించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి వారు బయటకు రాకుండా పహారా ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీకి సంబంధించిన ర్యాలీలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గడియార స్తంభం సెంటర్లో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు బయటకు వచ్చి గడియార స్తంభం సెంటర్లో ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ, సిట్ పేర్కొందన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు దానిని మభ్యపెట్టేందుకు నెయ్యిలో రసాయనాలు కలిశాయని కొత్త పాటకు తెరలేపారన్నారు. కవ్వింపు చర్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కేసులో సంబంధం లేని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలు వేయడం దారుణమన్నారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఫ్లెక్సీలు వేసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఫ్లెక్సీ వ్యవహారంలో గుంటూరు సంఘటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన సంఘటన మరువకముందే చీరాలలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్నారు. టీడీపీ చేపట్టిన ర్యాలీ ఇదే మార్గంలో రావడంతో ఎమ్మెల్యే మెప్పు కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న చీరాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే అప్పటికప్పడు ఫ్లెక్సీ వేశారని ఆరోపించారు. అభివృద్ధి పనులపై దృష్టి సారించకుండా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. టీడీపీ నీచ రాజకీయాలకు చరమగీతం పాడాలని నినాదాలు చేశారు. వైఎస్సార్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసి ఫ్లెక్సీని తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని మానవహారంగా ఏర్పడ్డారు. దీంతో పోలీసులు మనుషులను పెట్టి ఆ ఫ్లెక్సీని తొలగించారు. మొత్తం మీద ఉద్రిక్తతల అనంతరం ప్రశాంత వాతావరణం నెలకొంది.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు వాసిమళ్ళ వాసు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గోసాల అశోక్, కౌన్సిలర్లు బత్తుల అనిల్, కంపా అరుణ్, గుంటూరు ప్రభాకరరావు, పార్టీ నాయకులు చెల్లి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆందోళనతో ఫ్లెక్సీని తొలగించడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే, కవ్వింపు చర్యలను ప్రజలు చూస్తూన్నారని, తాము చట్టపరంగా, ధర్మబద్ధంగా, న్యాయపరంగా మాత్రమే అడుగులు వేస్తామని పేర్కొన్నారు. అంతిమంగా పరిస్థితులు మితిమీరితే తాము కూడా అదే తీరున స్పందించటంలో ఏమాత్రం వెనకాడబోమని పేర్కొన్నారు.
సదరు టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటులో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి కీలక పాత్ర పోషించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలో సదరు ఉద్యోగి ఫ్లెక్సీ ఏర్పాటుకు ఫ్లెక్సీని పట్టుకున్న సమయంలో ఫొటోలు తీస్తున్న ఓ పత్రికా విలేకరిని నువ్వెవరు ఫొటోలు, వీడియోలు తీయడానికంటూ.. రుబాబుగా ప్రశ్నించటం కూడా విమర్శలకు తావిచ్చింది.
ఇది రాజకీయమా .. కవ్వింపా..!
ఇది రాజకీయమా .. కవ్వింపా..!


