పొలాలు ఇచ్చేందుకు అంగీకరించని రైతులు
గోవాడ(వేమూరు): మహా శివరాత్రి సందర్భంగా గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే వాహనాలు పార్కింగ్ చేసేందుకు తమ పొలాలు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. దీంతో దేవస్థానం అధికారులు, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అమర్తలూరు మండలం గోవాడలోని బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈనెల 13వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో వస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వాహనాలను పార్కింగ్ చేసేందుకు ప్రతి ఏడాది రైతులు తమ పొలాలు ఇస్తుంటారు. ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. అయితే ఈ ఏడాది రైతులు తమ పొలాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. తహసీల్దారు నెహ్రుబాబు, చుండూరు సీఐ, ఆనందరావు, ఎంపీడీవో మారుతి శేషాంబలు శుక్రవారం వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రైతులు పొలాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. అధికారులలో అయో మయం నెలకొంది. ట్రాఫిక్ నియంత్రణ గురించి పోలీసు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రైతులు పొలాలు ఇస్తే ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడటం జరుగుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. రైతులు పొలాలు ఇవ్వకపోతే ట్రాఫిక్ నియంత్రణ చేయడం కష్టంగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రైతులు పొలాలు ఇచ్చి సహకరిస్తే మహాశివరాత్రి ఎలాంటి సమస్యలు లేకుండా జరుగుతుందని, రైతులు పూర్తిగా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. తిరునాళ్ల సమయంలో ట్రాక్టర్లు తిప్పడంతో పంట దెబ్బతిని నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు.


