సముద్రంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
●విషాదంగా మారిన పుట్టినరోజు వేడుకలు
●గల్లంతైన విద్యార్థుల కోసం తీవ్రంగా గాలింపు
చినగంజాం: పుట్టిన రోజును ఆనందంగా గడుపుదామనుకున్న నలుగురు స్నేహితుల ఆనందం చివరకు విషాదం మిగిల్చింది. స్నేహితుడు పుట్టిన రోజు నాడు సముద్రంలోకి సరదాగా వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటన గురువారం చినగంజాం సముద్ర తీరంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల సమాచారం మేరకు..ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు చందలూరి శ్రీరామ్ (15), బిక్కి అవినాష్ (15), గుంజి హేమవర్థన్, తాటిపర్తి హేమంత సాయిలు స్నేహితుడు శ్రీరామ్ పుట్టినరోజును పురస్కరించుకొని సరదాగా సముద్రంలో స్నానం చేసేందుకు చినగంజాం మండలం పల్లెపాలెం పంచాయతీ బాపయ్యనగర్ సముద్ర తీరానికి వచ్చారు. వీరంతా దుద్దుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నలుగురు విద్యార్థులు ఆనందంగా సముద్రంలో గడుపుతున్న సమయంలో అలల తాకిడికి బిక్కి అవినాష్, చందలూరి శ్రీరామ్‌లు కన్పించకుండా సముద్రపు నీటిలో చిక్కుకొని గల్లంతయ్యారు. ఇద్దరు స్నేహితుల ఆచూకీ తెలియకపోవడంతో సముద్రం నుంచి బయటకు వచ్చిన హేమవర్ధన్, తాటిపర్తి హేమసాయిలు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్యలకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను విచారించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. నలుగురు స్నేహితులు కలిసి చినగంజాం సముద్రతీరానికి ఒకే మోటారు బైక్‌పై వచ్చినట్లు ఘటన నుంచి బయటపడ్డ విద్యార్థులు తెలిపారు. గురువారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకున్న గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఆచూకీ లభించక పోవడంతో శోక సముద్రంలో మునిగిపోయారు. వారు రోదిస్తున్న తీరు చూపరులను కలచి వేసింది.
సముద్రంలో ప్రత్యేకంగా గాలింపు
గల్లంతైన ఇద్దరు విద్యార్థుల కోసం అగ్నిమాపక సిబ్బంది, మైరెన్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది గాలించారు. ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య ఆధ్వర్యంలో స్థానికంగా ప్రత్యేక బోటు తెప్పించి సముద్రంలో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి బాగా పొద్దుపోయేంతవరకు గాలించినా ఫలితం లేదు. గాలింపు చర్యల్లో ఇంకొల్లు ఎస్సై జి.సురేష్, చినగంజాం పోలీస్ సిబ్బందితోపాటు మైరెన్ సీఐ రమేష్ బాబు, డీఎఫ్‌ఓ కె.వినయ్, చీరాల ఏడీఎఫ్ వీవీ రామకృష్ణ పాల్గొన్నారు.
పేద కుటుంబాలకు చెందిన వారే..
నలుగురు విద్యార్థుల్లో చందలూరి శ్రీరామ్, బిక్కి అవినాష్, గుంజి హేమవర్ధన్ ఇంకొల్లు మండలంలోని దుద్దుకూరు గ్రామానికి చెందిన వారు కాగా తాటిపర్తి హేమంత్ సాయి రాచపూడి గ్రామానికి చెందిన వాడు. గల్లంతై వారిలో చందలూరి శ్రీరామ్ తండ్రి వాసు వ్యవసాయ కూలీ కాగా తల్లి సునీత ఒంగోలు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. ఇతనికి ఒక సోదరుడు కాగా, మరో విద్యార్థి బిక్కి అవినాష్ తండ్రి అశోక్ వ్యవసాయ కూలీ, తల్లి అంజమ్మ గృహిణి, ఇతనికి ఒక సోదరి ఉంది. శ్రీరామ్ పుట్టిన రోజు పురస్కరించుకొని గురువారం పావులూరులోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వచ్చారు. ఇంతలోనే కొడుకు గల్లంతు కావడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
గల్లంతయిన బిక్కి అవినాష్ (ఫైల్)
గల్లంతైన చందలూరి శ్రీరామ్(ఫైల్)
సముద్రంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
సముద్రంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు


