శాంతి భద్రతల పరిరక్షణలో ఏఆర్ విభాగం కీలకపాత్ర
●సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని విధులు నిర్వర్తించాలి
●డీ మొబిలైజేషన్ ముగింపు సమావేశంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: శాంతిభద్రతల పరిరక్షణలో ఏఆర్ పోలీస్ విభాగం పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా సాయుధ బలగాలకు నిర్వహించిన మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ వృత్తిపరమైన, వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తూ పోలీసుశాఖ ప్రతిష్ట మరింత పెరిగేలా సాయుధ బలగాల పనితీరు ఉండాలన్నారు. తొలుత పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి పోలీసు బలగాల ప్లటూన్లను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్, బ్యాండ్ ప్రదర్శన చక్కగా ప్రదర్శించారన్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ఏఆర్ సిబ్బంది విధుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం మొబిలైజేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సాధారణ బందోబస్తు విధుల నుంచి శాంతిభద్రతల సమస్యల పరిరక్షణ వరకు ఏఆర్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సిబ్బందికి ఎవరికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే సత్వర పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే సిబ్బందికి సబ్సిడీ ధరలకే నిత్యావసర సరుకులు, వస్తువులు అందించేందుకు బాపట్లలో త్వరలోనే పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
● అదేవిధంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహన చోదకులకు హెల్మెట్ ధరించాలని చెప్పేముందు పోలీసు సిబ్బంది సైతం హెల్మెట్ ధరించి, వారికి మార్గదర్శకులుగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందిని, పరేడ్ కమాండర్ అడ్మిన్ ఆర్‌ఐ షేక్ మౌలుద్దీన్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఇన్‌చార్జ్ డీఎస్పీ (సీసీఎస్ డీఎస్పీ) పి.జగదీష్ నాయక్, జిల్లాలోని సీఐలు, ఏఆర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


