దళితులపై మారణకాండ ఆపాలి
గుంటూరు వెస్ట్: ఎంఆర్‌పీఎస్ ఉద్యమ నాయకుడు టి.ఎం. రమేషన్ దారుణ హత్యపై ప్రభుత్వం విచారణ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని రాష్ట్ర కో–కన్వీనర్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదన్నారు. ఈ ఏడాది జనవరిలో కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్‌ను దారుణంగా కొట్టిచంపారన్నారు. దీనిని దళిత, ప్రజా సంఘాలు ఖండించాయని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం డీఆర్వో షేఖ్ ఖాజావలికి విజయ్ కుమార్, కారుమూరు బెర్నార్డ్ మాదిగ, ఎస్‌ప్రసాదరావు మాదిగ, కె.వీరబాబు మాదిగ వినతిపత్రం అందజేశారు.
నిర్వహణకు కేంద్రాల ఏర్పాటు సిద్ధం
చిలకలూరిపేటటౌన్: నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహిస్తున్నట్లు మద్దిరాల జేఎన్‌వీ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే ఈ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధిలో 2031 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో 9వ తరగతికి 838 మంది, 11వ తరగతికి 1193 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా పరీక్షల నిర్వహణకు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 10 గంటలకంటే ముందే చేరుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. హాజరయ్యే విద్యార్థులు తమ వెంట అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఈ రెండూ లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదన్న విషయాన్ని అభ్యర్థులు, తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. అడ్మిట్‌కార్డులో పొందు పరిచిన పరీక్ష కేంద్రం పేరు, చిరునామా, తేదీ, సమయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సరి చూసుకోవాలని తెలిపారు. అడ్మిట్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏవైన ఇబ్బందులు, సందేహాలు ఉంటే నవోదయ ప్రిన్సిపాల్ సెల్ 9014307677, 9494676751 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.


